పార్లమెంట్ సమావేశాలు.. హిడెన్ బర్గ్ రిపోర్ట్‌పై చర్చించాలని ఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు..

By Sumanth KanukulaFirst Published Feb 2, 2023, 9:57 AM IST
Highlights

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల వేళ అధికార బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్దమయ్యాయి. అదానీ స్టాక్స్, చైనాతో సరిహద్దు పరిస్థితి వంటి అనేక సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. 

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల వేళ అధికార బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్దమయ్యాయి. మంగళవారం రోజున పార్లమెంట్ బడ్జెట్ సమావేశం జరగగా.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అదే రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే టేబుల్ చేయగా.. బుధవారం(ఫిబ్రవరి 1) రోజు కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. ఇక, గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. అదానీ స్టాక్స్, చైనాతో సరిహద్దు పరిస్థితి వంటి అనేక సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. 

ఈ క్రమంలోనే అధికార బీజేపీపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఉభయ సభలలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చింది. హిండెన్ బర్గ్ నివేదికతో ప్రజలపై, దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడిందని పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా హిడెన్‌బర్గ్ నివేదికపై చర్చించేందుకు 267వ నిబంధన కింద రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.

ఈ క్రమంలోనే చైనాతో సరిహద్దు పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ‘‘అదానీ గ్రూప్ చేసిన ఆర్థిక అవకతవకలు, మోసం’’ అంశాన్ని లేవనెత్తడానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.  మరోవైపు  అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా హిడెన్‌బర్గ్ నివేదికపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

ఇక, బడ్జెట్ సమావేశాల తొలిరోజు పార్లమెంట్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బ‌హిష్క‌రించిన సంగతి తెలిసిందే. ఇక, బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యుహాంపై బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగ‌తి తెలిసిందే.
 

click me!