Khalistani terrorist Gurpatwant Singh Pannun : నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత పార్లమెంటుపై దాడి చేస్తానని హెచ్చరించాడు. ఈ నెల 13వ తేదీలోగా భవనంపై దాడి చేస్తానని బెదిరిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. తనను చంపేందుకు భారత్ కుట్ర పన్నినందుకే ఈ దాడికి పాల్పడబోతున్నానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
Gurpatwant Singh Pannun :ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత్ పై మరో సారి విషం కక్కాడు. డిసెంబర్ 13న లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని హెచ్చరించాడు. భారత్ పై తన విద్వేశాన్ని చూపిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. తనను హతమార్చేందుకు భారత్ కుట్ర పన్నుతోందని, అందుకే ఈ దాడికి పాల్పడబోతున్నట్టు బెదిరించాడు. కాగా.. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 13న వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పన్నూన్ హెచ్చరిక కొంత ఆందోళన కలిగిస్తోంది.
పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు, పక్కనే పన్నూన్ ఫొటో, దానిపైన ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్ గా మారుతుంది) అనే పోస్టర్ ను ప్రదర్శిస్తూ అతడు ఈ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశాడు. తనను చంపాలని భారత ఏజెన్సీలు ప్లాన్ చేశాయని, అది విఫలమైందని చెప్పాడు. డిసెంబర్ 13వ తేదీలోగా పార్లమెంటును ముట్టడించి సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వీడియో బయటకు రావడంతో కేంద్ర భద్రతా సంస్థలు, ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు.
undefined
సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. పన్నూన్ బెదిరింపు వీడియో బయటకు రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ఘటనలూ చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాయి.
అసలేం జరిగిందంటే ?
పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన ఒక భారతీయుడిని అరెస్టు చేశామని ఇటీవల అమెరికా పేర్కొంది. అరెస్టు అయిన వ్యక్తి భారత ఏజెన్సీల సూచనల మేరకే పనిచేస్తున్నాడని, భారత నిఘా సంస్థలు పన్ను హత్యకు పథకం సిద్ధం చేశాయని అమెరికన్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ అంశాన్ని సీరియస్‌గా అమెరికా సీరియస్ గా తీసుకుంది. భారత్ నుంచి విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ ఇలా బెదిరిస్తూ వీడియోలు విడుదల చేయడం ఇప్పుడే మొదటి సారి జరగలేదు. గతంలో కూడా అతడు భారత్ పై విషం కక్కుతూ చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశాడు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తానని బెదిరించి, ఆ రోజు విమానంలో ప్రయాణించవద్దని సిక్కులకు వీడియో విడుదల చేసి విజ్ఞప్తి చేశాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని, దాని పేరు మారుస్తామని కూడా ఆయన హెచ్చరించారు.