
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోన్న సంగతి తెలిసిందే. జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోడీ అమెరికాలో అడుగుపెట్టనున్నారు. ఆయన రాక కోసం అమెరికన్లు, ప్రవాస భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోడీ పర్యటనకు ఆటంకం కలిగించేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో క్రీయాశీలకంగా వున్న ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న పలు గ్రూపులతో ఐఎస్ఐ టచ్‌లోకి వెళ్లినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
భారత్‌పై పెద్ద కుట్రను అమలు చేయడమే వీరి లక్ష్యం. జాతీయ వార్తా సంస్థ జీ న్యూస్ కథనం ప్రకారం.. ప్రధాని మోడీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ ఐఎస్‌ఐ గత కొన్ని రోజులుగా అమెరికాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. అంతేకాదు.. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రను అమలు చేయడానికి అనేక సంస్థలకు నిధులు కూడా అందించినట్లుగా జీ న్యూస్ తన కథనంలో తెలిపింది. అగ్రరాజ్య పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు జరుగుతున్న సన్నాహాల తీరుపై పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.
భారత్‌పై అమెరికాకు పెరుగుతున్న విశ్వసనీయత దాయాదీ దేశానికి నచ్చడం లేదు. అందుకే ప్రధాని మోడీని ఎదిరించేందుకు టూల్‌కిట్ కూడా సిద్ధం చేసింది. ఇందులో భారతదేశాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలో , ఏ ఏ ప్రదేశాలలో నిరసన తెలియజేయాలో ఇప్పటికే ప్రణాళిక రూపొందించబడిందని జీ న్యూస్ తెలిపింది. అంతే కాదు, నిరసనల సందర్భంగా ఏ పోస్టర్లు ఉపయోగించాలో కూడా ఐఎస్ఐ తగిన సన్నాహాలు చేస్తోందట. నిరసన బాధ్యతలు అప్పగించిన వారిని నిరసన ప్రదేశానికి తీసుకెళ్లేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.
అంతేకాదు.. భారత్‌పై కుట్రను అమలు చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఇందులో ఇండియాపై కుట్రను అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొందరు సోషల్ మీడియాలో కోరుతున్నారట. మోదీ అమెరికా పర్యటన జూన్ 21 నుండి ప్రారంభమవుతుందని. ప్రధాని వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వెబ్‌సైట్లో పేర్కొంటున్నారు. భారత్‌పై ఐఎస్ఐ సిద్ధం చేసిన కుట్ర ప్రకారం.. మోదీ అమెరికాలో పర్యటించే మార్గాల్లో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని జీ న్యూస్ తన కథనంలో పేర్కొంది.
అలాగే సోషల్ మీడియాలోనూ #ModiNotWelcome వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్‌లోకి తెచ్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది. భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ నకిలీ పోస్టర్‌లు కూడా సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై పెరుగుతున్న విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ఐఎస్ఐ గతంలోనూ ఇలాంటి కుట్రలు అమలు చేసింది. ఇందులో నుపుర్ శర్మ వివాదాస్పద ప్రకటన తర్వాత పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు.