పాక్ వక్రబుద్ధి.. భారత్‌లో టిఫిన్ బాంబ్‌కు ఐఎస్ఐ ప్లాన్.. అలర్ట్ జారీ చేసినట్టు నిఘా వర్గాల వెల్లడి

By telugu teamFirst Published Sep 23, 2021, 4:30 PM IST
Highlights

రానున్న పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు రచిస్తున్నదని నిఘా వర్గాలు తెలిపాయి. ప్రజలతో కిక్కిరిసిపోయే ప్రాంతాల్లో టిఫిన్ బాక్స్ బాంబులను అమర్చి పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేస్తున్నట్టు వివరించాయి. దీనిపై ఈ నెల 18న అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నాయి. 
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో మారిన పరిస్థితుల నేపథ్యంలో భారత్‌(India)లో ఉగ్రచర్యలు పెరిగే ముప్పు ఉన్నదని ఇప్పటికే నిఘా వర్గాలు భావించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లతో సఖ్యంగా మెదిలి భారత్‌లో ఉగ్రపేలుళ్లకు పాకిస్తాన్(Pakistan) కుట్రలు చేసే అవకాశముందని పేర్కొన్నాయి. ఇందుకోసమే తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ(ISI) చీఫ్  ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడన్న చర్చ కూడా జరిగింది. ఈ ఆందోళనలను మరింత బలపరుస్తూ తాజాగా భారత నిఘా వర్గాలు(Intelligence) మరో భయానక విషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) భారత్‌లో భారీ పేలుళ్ల(terror strike)కు కుట్ర(plan) చేస్తున్నదని తెలిపింది. దీనికి సంబంధించి ఈ నెల 18వ తేదీనే అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొంది.

వచ్చే పండుగ సీజన్‌నే టార్గెట్ చేసుకుని భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జనసమ్మర్ధం ఎక్కువగానుండే ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని భావిస్తున్నట్టు వివరించాయి. ఇందుకోసం టిఫిన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు అమర్చి విధ్వంసం సృష్టించే వ్యూహాన్ని అమలు చేసే అవకాశముందని చెప్పాయి. ఈ ప్లాన్ అడ్వాన్స్ స్టేజీలో ఉన్నదని, కుట్ర కోసం మనుషులు, మెటీరియల్, ఫైనాన్స్ సమకూర్చుకుందని వెల్లడించాయి. ఈ పండుగ సీజన్‌లోనే సరిహద్దుల నుంచి దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువగా జరిగే అవకాశముందనీ తెలిపాయి.

ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇటీవలే పాకిస్తాన్‌కు చెందిన ఓ టెర్రర్ మాడ్యుల్‌ గుట్టును రట్టు చేసిన సంగతి తెలిసిందే. నవరాత్రి, రామ్‌లీల రోజుల్లో దాడులకు పాల్పడాలనుకున్న అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఇందులో ఆరుగురు పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాన్నీ వీరి నుంచి స్వాధీన పరుచుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి రావడంతో భారత్‌లో సెక్యూరిటీపై ఆందోళనలు వెలువడ్డాయి. కేంద్ర రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దీన్ని అదునుగా తీసుకుని సరిహద్దు గుండా విధ్వంసం సృష్టించాలని భావిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. అలాంటి అవాంఛనీయ కుట్రలను ఎదుర్కోవడానికి భారత్ సమర్థవంతంగా ఉన్నదని, సంసిద్ధంగానూ ఉన్నదని స్పష్టం చేశారు.

click me!