ఇజ్జత్‌ కా సవాల్..! అసెంబ్లీలో ఊడిన మాజీ సీఎం పంచె.. హీటెక్కిన సభలో నవ్వులు

By telugu teamFirst Published Sep 23, 2021, 3:47 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మాజీ సీఎం సిద్దా రామయ్య పంచె ఊడింది. ఈ విషయాన్ని డీకే శివకుమార్ ఆయనకు చెవిలో చెప్పగా ఆయన ఏకంగా అనౌన్స్ చేసేశారు. కరోనా నుంచి రికవరీ అయినప్పటి నుంచి పొట్టపెరిగిందని, అప్పటి నుంచి దోతి ఊడిపోతున్నదని చెప్పారు. దీంతో సీరియస్ చర్చ సాగుతున్న సభలో నవ్వులు విరిశాయి. 

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ(Assembly)లో ప్రభుత్వం, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. బెంగళూరు లైంగికదాడిపై కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దా రామయ్య(Siddaramaiah) గొంతు పెద్ద చేసి వాదనలు చేస్తున్నారు. కానీ, ఇంతలోనే ఆయన పంచె(Dhoti) ఊడుతూ(slip) కనిపించింది. ఈ విషయాన్ని చూసిన వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు డీకే శివకుమార్ రామయ్య దగ్గరకు వెళ్లారు. ఆయన చెవిలో గుసగుసగా పంచె ఊడుతున్న విషయాన్ని చెప్పారు. దీంతో గంభీరంగా ఉన్న సభ ఒక్కసారిగా ఘొల్లుమన్నది.

సిద్దా రామయ్య చెవిలో డీకే శివకుమార్ పంచె ఊడుతున్నదని చెప్పగానే ‘ఓహ్.. ఔనా’ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వెంటనే తమాయించుకుని దోతి కట్టుకున్నాక తన ప్రసంగాన్ని కొనసాగిస్తానని చెప్పారు. మైసూరు గ్యాంగ్ రేప్‌పై వాదనలో మునిగిపోయిన ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. సభాపతి మధు బంగారప్ప సహా కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ నేతలూ తలా ఓ కామెంట్ వేస్తూ నవ్వులు పూయించారు.

తన దోతి కట్టుకుంటూ కరోనా రికవరీ తర్వాత నాలుగైదు కిలోలు పెరిగానని, అప్పటి నుంచి తన పంచె ఊడిపోతున్నదని సిద్దా రామయ్య అన్నారు. అంతేకాదు, ఆర్‌డీపీఆర్ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను ఉద్దేశిస్తూ సిద్దా రామయ్య మాట్లాడుతూ.. ‘నా పంచె ఊడిందప్పా. నా పొట్ట పెరిగినప్పటి నుంచి దోతి తరుచూ ఊడిపోతున్నది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై సదరు మంత్రి నవ్వుతూ కనిపించారు. కాగా, ట్రెజరీ బెంచ్ నుంచి కొందరు ఆయనకు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ, ‘మీరు బెంచ్‌కు అటువైపునా కూర్చున్నారు. కదా.. మీ సహాయాన్ని తీసుకోలేను’ అని అన్నారు.

కాగా, ఈ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ దోతి ఊడుతున్నదని సిద్దా రామయ్య చెవిలో చెప్పారు. ఆయన ప్రతిష్ట, పార్టీ ప్రతిష్టను కాపాడటానికి ఆయన చెవిలో చెప్పారు. కానీ, సిద్దా రామయ్యా ఈ విషయాన్ని సభికులందరికీ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటి నుంచి బీజేపీ దీనిపై విమర్శలు చేస్తూనే ఉంటది’ అని అన్నారు. దీనికి స్పందిస్తూ ‘వారు ప్రయత్నించవచ్చేమో కానీ, మన ప్రతిష్టను దెబ్బతీయలేరు’ అని సిద్దా రామయ్య అన్నారు.

click me!