Pakistan: కశ్మీర్‌ అంశంపై పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భారత్‌తో చర్చిస్తామంటూనే

Published : Feb 05, 2025, 08:43 PM ISTUpdated : Feb 05, 2025, 08:50 PM IST
Pakistan: కశ్మీర్‌ అంశంపై పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భారత్‌తో చర్చిస్తామంటూనే

సారాంశం

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ప్రజలకు తమ మద్ధతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అదే విధంగా కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. పీఓకేపై జరిగిన శాసనసభ ప్రత్యేక సమావేశంలో షరీఫ్ ప్రసగించే సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "కశ్మీర్ సంఘీభావ దినోత్సవం" సందర్భంగా ముజఫరాబాద్‌లో జరిగిన సమావేశంలో పాక్‌ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మేము కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. 2019 ఆగస్టు 5న భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని, దాని పరిణామాలను గుర్తుచేస్తూ, "భారతదేశం ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, చర్చలను ప్రారంభించాలని ఆయన అన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 1999లో లాహోర్ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు.. అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్ సందర్శించిన సమయంలో చెప్పినట్లుగా పాక్‌, భారత్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలు మాత్రమే ఏకైక మార్గమని షరీఫ్‌ అన్నారు. 

భారతదేశం ఆయుధాలు కూడబెట్టుకుంటోందని పాక్‌ ప్రధాని ఆరోపించారు. ఆయుధాలు శాంతి చేకూర్చవని, ఇవి ఈ ప్రాంత ప్రజల తలరాతను మార్చవంటూ షరీఫ్‌ చెప్పుకొచ్చారు. పురోగతికి మార్గం శాంతియే అంటూ షరీఫ్‌ నీతులు చెప్పుకొచ్చారు. ఇక కశ్మీరీ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు సాకారం అయ్యే వరకు పాకిస్తాన్ తన దృఢమైన నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును అందిస్తూనే ఉంటుందని షరీఫ్‌ అన్నారు. కశ్మీర్ సమస్యకు ఏకైక పరిష్కారం UNSC తీర్మానం ప్రకారం స్వయం నిర్ణయాధికార హక్కు మాత్రమే అని షరీఫ్‌ చెప్పుకొచ్చారు. 

కశ్మీర్‌ ప్రాంతంలో శాశ్వత శాంతికోసం ఇక్కడి ప్రజలు తమ భవిష్యత్తును స్వేచ్ఛగా నిర్ణయించుకోవడానికి భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రధానితో పాటు, పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు ప్రకటించారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్, సర్వీస్ చీఫ్స్, పాకిస్తాన్ సాయుధ దళాలు కూడా కాశ్మీరీ ప్రజలకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ప్రాంతంలో శాంతి సాధ్యం కాదని ఆయన చెప్పారు. మరి పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు