
భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించేందుకు దాయాది దేశం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నిషేధానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయని అక్కడి మీడియా కథనాలు ప్రకటించాయి.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం.. గగనతల ఆంక్షలు ఒకేసారి ఒక నెల కంటే ఎక్కువ కాలం విధించేందుకు ఆస్కారం లేదు. పాకిస్థాన్ గత నెల విధించిన నిషేధం మే 23 వరకు అమల్లో ఉండనుంది. ఆలోపు మరో నెలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా భారత విమానాలకు గగనతల ఆంక్షలను పాకిస్థాన్ గతంలోనూ విధించిన విషయం తెలిసిందే. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో, 2019 పుల్వామా ఘటన తదనంతర ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఈ ఆంక్షలు కొనసాగాయి.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం దాయాది దేశంపై ప్రతీకార చర్యలకు భారత్ ఉపక్రమించింది. ఇందులో భాగంగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేతతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.