
ముంబై : పద్మభూషణ్ అవార్డు గ్రహీత, క్లాసికల్ డాన్సర్ కనక్ రెలే.. తన 85వ యేట ముంబైలో హఠాత్తుగా మృతి చెందారు. ఆమె గుండెపోటుకు గురవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. గురువారం ఉదయం ఆమె పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తమ సంతాపాన్ని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో వెటరన్ నటి హేమామాలిని, సుధా చంద్రన్ ఉన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.
కనక్ రెలే మోహిని అట్టం డాన్స్ లో ప్రసిద్ధురాలు. నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు ఆమె. ఆ విద్యాలయానికి ప్రిన్సిపల్ గా కూడా పని చేశారు. కనక్ రెలే శాస్త్రీయ నృత్యానికి ఎంతో సేవ చేశారు. వీటికి గుర్తింపుగా భారత ప్రభుత్వం కనక్ రెలేకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో అభినందించింది. కనక్ రెలే 1937 జూన్ 11న గుజరాత్ లో జన్మించారు. ఆమె స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో కనక్ రెలే ఒకరు.
వెస్ట్ బెంగాల్ లోని శాంతినికేతన్ లో చదువుకున్నారు. విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. ఆమె నృత్యం అభ్యసించడం వెనక తన మేనమామ ఉన్నారు. ఆయన ప్రోత్సాహం మేరకే ఆమె నృత్యం నేర్చుకున్నారు.