ఓనర్షిప్ ప్రభుత్వానిదే.. ఆస్తులను అమ్మడం లేదు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

By telugu teamFirst Published Aug 23, 2021, 6:30 PM IST
Highlights

రానున్న నాలుగేళ్లలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు చెందిన కొన్ని ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్లను ఆర్జించాలనే లక్ష్యంతో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్‌ఎంపీ)ని రూపొందించింది. దీని ద్వారా రోడ్డు, రైల్వే, ఎయిర్‌పోర్టులు మొదలు విద్యుత్ సరఫరా రంగాల వరకు ఆస్తులను సొమ్ముచేసుకోవాలనుకుంటుంది. తాము ఆస్తులను అమ్మడం లేదని, కొంత కాలానికి మళ్లీ అవి ప్రభుత్వ అధీనంలోకి వస్తాయని, వాటిపై యాజమాన్య బాధ్యతలు ప్రభుత్వానికే ఉంటాయని ఎన్ఎంపీని ప్రారంభిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌(ఎన్ఎంపీ)ను ప్రారంభిస్తూ కీలక ప్రకటనలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో దేశంలోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తుల విక్రయాల ప్రణాళికను ఆమె ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా ఎన్ఎంపీ ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం కొన్ని రంగాలనే తనతో అంటిపెట్టుకుని మిగతావాటన్నింటినీ ప్రైవేటుపరం చేయాలని భావిస్తున్నట్టు
అభిప్రాయపడుతున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రభుత్వ ఖజానాకు ఫైనాన్సింగ్ కోసం పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్‌ సొమ్ము చేసుకోవచ్చునని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, సహా పలువురు సీనియర్ అధికారులు సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎన్ఎంపీ ద్వారా ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను సొమ్ము చేసుకుంటుందని అమితాబ్ కాంత్ అన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రభుత్వం భూములను అమ్మడం లేదని, వనరులను, ఆస్తులను అమ్మడం లేదని స్పష్టం చేశారు. అయితే, కొన్ని అసెట్‌ల ద్వారా డబ్బును సమకూర్చుకుంటున్నప్పటికీ వాటిపై యాజమాన్యం ప్రభుత్వానిదే ఉంటుందని వివరించారు. కొంత కాలం తర్వాత ఆ ఆస్తులు మళ్లీ ప్రభుత్వ అధీనంలోకే వస్తాయని చెప్పారు. ఎన్ఎంపీ కింద భూములను అమ్మడం లేదని, పెద్దగా వినియోగంలో లేని సంస్థలనే అమ్ముతున్నట్టు తెలిపారు. వీటి ద్వారా వచ్చిన నిధులను మళ్లీ
మౌలిక సదుపాయాల నిర్మాణాలకే ఖర్చు చేస్తామని వివరించారు. రైలు, రోడ్డు, విద్యుత్ రంగాల్లోని ఆస్తుల ద్వారా నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్లను ఆర్జించనున్నట్టు తెలిపారు. 

click me!