లాలూజీ ఎలా ఉన్నారు?: ‘కుల గణన’ భేటీలో ప్రధాని సరదా సంభాషణ

By telugu teamFirst Published Aug 23, 2021, 5:24 PM IST
Highlights

కుల గణనపై జరిగిన భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటు ఆయన కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ను అడిగారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అక్కడే ఉన్న మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీతోనూ సరదా సంభాషణ చేశారు. అనంతరం అజెండాపై చర్చించారు.

న్యూఢిల్లీ: జనాభ లెక్కింపులో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బిహార్ ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు ప్రధాని మోడీని కలిశారు. సీఎం నితీశ్ కుమార్‌తోపాటు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్, ఇతర నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సరదా సంభాషణతో మొదలుపెట్టారు. ముఖ్యంగా లాలూజీ గురించి ఆరా తీశారు. ఆయన గురించి తేజస్వీ యాదవ్‌ను చాలా ప్రశ్నలు అడిగారు. సమావేశానికి హాజరైన నేతలందరూ ఈ తీరుపై ఆశ్చర్యపడ్డారు.

దాణా కుంభకోణం కేసులో జైలుకెళ్లిన లాలూజీ శ్వాసకోశ, మూత్రపిండాలు, హృద్రోగ సమస్యలతో పలుసార్లు హాస్పిటల్‌లో చికిత్స పొందారు. జైలు శిక్ష పొందుతూనే ఎయిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. గత ఏప్రిల్ నెలలో బెయిల్‌పై విడుదలయ్యారు.

సమావేశం ప్రారంభమవ్వగానే ప్రధాని మోడీ తొలుత ‘లాలూజీ ఎలా ఉన్నారు?’ అని తేజస్వీ యాదవ్‌ను అడిగారు. లాలూజీ సమస్యలు, బాగోగుల గురించి తేజస్వీ యాదవ్ ప్రధానికి వివరించారు. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రధాని కోరుకున్నారు.

మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీపై సరదా కామెంట్లు విసిరారు. మాంఝీ మాస్క్‌ను చూపిస్తూ ‘నీవు మాస్కులో ఉన్నావే? నీ స్మైలింగ్ ఫేస్ చూసేదెలా?’ అని అన్నారు. ఈ కామెంట్‌పై నితీశ్ కుమార్ మధ్యలో దూరారు. ‘ఇది మీవల్లే. మందిలో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలనిచ్చింది మీరే కదా’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అనంతరం అజెండాపై చర్చను ప్రారంభించారు.

బిహార్ సహా యావత్ దేశమంతా కుల గణనపై తమతోనే ఉన్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తమ అభిప్రాయాలు వినే ప్రధానమంత్రి ఉన్నందుకు సంతోషిస్తున్నామని, ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్టు వివరించారు. కేవలం బిహార్ రాష్ట్రానికే కాదు, దేశమంతటా కుల గణన జరగాలని తాము డిమాండ్ చేసినట్టు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. జంతువులు, చెట్లు అన్నింటినీ ఆయా జాతుల పేర్లతో లెక్కిస్తున్నప్పుడు మనుషులను ఎందుకు అలా గణించవద్దని అడిగారు.

click me!