విందు రాజకీయం: యడ్డీకి పాతిక మంది ఎమ్మెల్యే షాక్, కుర్చీకీ ఎసరేనా..?

By Siva KodatiFirst Published Feb 4, 2021, 4:12 PM IST
Highlights

కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మంత్రి వర్గ సహచారులు, ఇతర పెద్దల మధ్య సఖ్యత కుదర్చలేకపోతున్నారు. ఇవన్నీ అంతిమంగా ఆయన కుర్చీకి ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి

కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మంత్రి వర్గ సహచారులు, ఇతర పెద్దల మధ్య సఖ్యత కుదర్చలేకపోతున్నారు. ఇవన్నీ అంతిమంగా ఆయన కుర్చీకి ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే... బుధవారం బెంగళూరులో తన అధికారిక నివాసం కావేరిలో సీఎం యడియూరప్ప మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు. అందరికీ ఆహ్వానాలు సైతం వెళ్లాయి.

అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తరువాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నో ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తూ, కష్టాల్లోనూ విడిచిపెట్టుకుండా ఉన్నవారిని కాదని వలసవాదులకు పదవులు కట్టబెట్టారంటూ అసంతృప్త నేతలు విమర్శిస్తున్నారు.

దీనిని గమనించిన యడియూరప్ప అసంతృప్తిని చల్లార్చేందుకు విందు రాజకీయం చేశారు. గతకొంత కాలంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా యడ్డీని సీఎం కుర్చి నుంచి దించేసి మరో నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పట్టుబడుతున్నారు. తాజాగా సీఎం విందు భోజనానికి సొంత ఎమ్మెల్యేలు రాకపోవడం కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి ఆయన మంత్రిపదవులు కట్టబెట్టారు. అయితే యడ్డీ నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. 

కాగా, ముఖ్యమంత్రి ఆహ్వానించిన విందుకు రెబెల్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్, సునీల్‌ కుమార్‌తో పాటు 25 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. మరి ఎమ్మెల్యేల వ్యవహారంపై యడ్డీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి. 

click me!