ఆ రెస్టారెంట్ ఓనర్‌ను స్విగ్గీ డెలివరీ బాయ్ చంపాడా? ఆ వార్తల్లో నిజమెంతా?

By telugu teamFirst Published Sep 1, 2021, 3:27 PM IST
Highlights

గ్రేటర్ నోయిడాలో ఓ డెలివరీ బాయ్ ఆర్డర్ లేట్ అయిందని రెస్టారెంట్ ఓనర్‌నే తుపాకీతో కాల్చి చంపినట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. గ్రేటర్ నోయిడాలోని జామ్ జామ్ రెస్టారెంట్ ఓనర్ సునీల్ అగర్వాల్‌ హత్యలో స్విగ్గీ డెలివరీ బాయ్ నేరుగా ఇన్వాల్వ్ కాలేదని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: ఆర్డర్ ప్రిపరేషన్‌లో జాప్యం జరుగిందని ఓ రెస్టారెంట్ ఓనర్‌ను స్విగ్గీ  డెలివరీ బాయ్ తుపాకీతో కాల్చి చంపినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ఆయనను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ, వీటిని ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. రెస్టారెంట్ ఓనర్ హత్యలో స్విగ్గీ డెలివరీ బాయ్ నేరుగా ఇన్వాల్వ్ కాలేడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఓనర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్ అని తెలిపారు. ఈ ముగ్గురిని అరెస్టు చేయడంలో చిన్నపాటి గన్ ఫైట్ చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు వికాస్ కాలుకు బుల్లెట్ గాయమైనట్టు వివరించారు.

గ్రేటర్ నోయిడాలో మిత్ర సొసైటీలోని జామ్ జామ్ ఫుడ్ డెలివరీ రెస్టారెంట్ దగ్గరకు స్విగ్గీ డెలివరీ బాయ్ మంగళవారం అర్ధరాత్రి చేరుకున్నాడు. చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ డెలివరీ కోసం వెయిట్ చేశాడు. రెస్టారెంట్‌లోని నారాయణ్ అనే వర్కర్ చికెన్ బిర్యానీని డెలివరీ బాయ్ చేతిలో పెట్టాడు. పూరీ సబ్జీకి సమయం పడుతుందని, వెయిట్ చేయాలని సూచించాడు. డెలివరీ లేట్ కావడంపై స్విగ్గీ డెలివరీ బాయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ప్రిపేర్ చేయాలని వర్కర్ నారాయణ్‌తో గొడవకు దిగాడు.

ఇది గమనించిన రెస్టారెంట్ ఓనర్ సునీల్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ మరింత మండిపడ్డాడు. అదే సమయంలో ఓనర్ సునీల్ అగర్వాల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అంతే సునీల్ కిందపడి విలవిల్లాడాడు. వర్కర్ నారాయణ్ సహా ఇతరులు సునీల్‌ను సమీపంలోని యథార్థ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆయన అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే తొలుత సునీల్‌పైకి ఆ డెలివరీ బాయే కాల్పులు జరిపినట్టు కథనాలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో అక్కడ మరికొందరూ తాగి తచ్చాడుతున్నట్టు తెలిసింది.

click me!