Positive India : గత 10 సంవత్సరాల్లో భారతదేశంలోని పేద జనాభా వద్ద సొంత వాహనాల (బైక్‌లు, స్కూటర్లు, కార్లు లేదా జీపులు) సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు 40% మంది పేదల వద్ద సొంత ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి.
Poorest Households that owned a vehicle in india: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో పేదల వద్ద సొంత వాహనాలు కూడా పెరుగుతున్నాయి. భారతదేశంలోని గడిచిన పదేండ్లలో పేదల విషయంలో సొంత వాహనాలు ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరింది. 2011-12లో కేవలం 6 శాతం పేద కుటుంబాల వద్ద సొంత మోటార్ సైకిల్, స్కూటర్, కారు లేదా జీప్ ఉన్నాయి. అయితే, 2022-23 నాటికి 40 శాతం పేద కుటుంబాల వద్ద ఈ ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ సంఖ్య పంజాబ్‌లో అత్యధికంగా ఉంది. పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో 2011-12లో కేవలం 15.5% పేద కుటుంబాల వద్ద సొంత ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. కానీ, 2022-23 నాటికి ఈ సంఖ్య 62.5 శాతానికి కి పెరిగింది.
పంజాబ్ పట్టణ ప్రాంతాల్లో 65.7% మంది వద్ద సొంత వాహనాలు
కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, పంజాబ్ పట్టణ ప్రాంతాల్లో 2011-12లో కేవలం 14 శాతం మంది వద్ద సొంత వాహనాలు ఉండగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 65.7 శాతానికి పెరిగింది. దీంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్ అగ్రస్థానంలో ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో రెండో స్థానంలో కర్ణాటక, పట్టణాల్లో మధ్యప్రదేశ్
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్ద ఉన్న సొంత వాహనాల విషయానికి వస్తే, పంజాబ్ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. 2011-12లో కర్ణాటకలో కేవలం 3.3 శాతం పేద జనాభా వద్ద సొంత వాహనాలు ఉండగా, 2022-23 నాటికి 56.6 శాతం మంది వద్ద సొంత వాహనాలు ఉన్నాయి. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల విషయంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2011-12లో 7.2 శాతం పేద పట్టణ జనాభా వద్ద సొంత వాహనాలు ఉండగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 62 శాతానికి పెరిగింది.
ఈ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో సొంత వాహనాల సంఖ్య వేగంగా పెరిగింది
2011-12 మరియు 2022-23 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సొంత వాహనాల శాతం పరంగా చూస్తే, మూడో స్థానంలో తమిళనాడు, నాలుగో స్థానంలో గుజరాత్, ఐదో స్థానంలో కేరళ, ఆరో స్థానంలో రాజస్థాన్, ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఎనిమిదో స్థానంలో మధ్యప్రదేశ్, తొమ్మిదో స్థానంలో హర్యానా, పదో స్థానంలో మహారాష్ట్రలు ఉన్నాయి.
ఈ రాష్ట్రాల పట్టణ ప్రాంతాల్లో ప్రజల వద్ద సొంత వాహనాలు పెరిగాయి
అలాగే, 2011-12 నుంచి 2022-23 మధ్యకాలంలో పట్టణ ప్రాంతాల్లో సొంత వాహనాల శాతం పరంగా చూస్తే, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో గుజరాత్, ఐదో స్థానంలో తమిళనాడు, ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఏడో స్థానంలో కేరళ, ఎనిమిదో స్థానంలో మహారాష్ట్ర, తొమ్మిదో స్థానంలో హర్యానా, పదో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి.