తప్పిన భారీ ముప్పు: విమాన పైలట్‌కు మార్గంమధ్యలో హర్ట్ ఎటాక్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

By telugu teamFirst Published Aug 27, 2021, 4:29 PM IST
Highlights

బంగ్లాదేశీ విమానానికి పెను ప్రమాదం తప్పింది. మాస్కో నుంచి వస్తున్న బిమాన్ బంగ్లాదేశ్ విమాన పైలట్‌కు హఠాత్తుగా గుండె నొప్పి మొదలైంది. దీంతో ఏం చేయాలోపాలుపోలేదు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కోల్‌కతా ఏటీసీని సంప్రదించారు. కోల్‌కతా ఏటీసీ సూచనల మేరకు సమీపంలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లోని 126 మంది ప్రయాణికులు సేఫ్‌గానే ఉన్నారు.

న్యూఢిల్లీ: ఓ బంగ్లాదేశీ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మాస్కో నుంచి ఢాకా వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ పైలట్‌కు మార్గంమధ్యలోనే హార్ట్ ఎటాక్ వచ్చింది. విమానం గాలిలో ఎగురుతూనే ఉండగా, కాక్‌పిట్‌లో ఆయన గుండెపోటుకు లోనయ్యారు. వెంటనే ఆయన కోల్‌కతా ఏటీసీని సంప్రదించారు. ఏటీసీ సూచనల మేరకు సమీపంలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానంలో 126 మంది ప్రయాణికులుండటం గమనార్హం.

బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్ మాస్కో నుంచి ఢాకాకు ప్రయాణిస్తున్నది. ఆ విమానం ఇండియాకు చేరగానే పైలట్‌కు గుండెలో నొప్పి మొదలైంది. అది తీవ్రరూపం దాల్చగానే వెంటనే సమీపంలోని కోల్‌కతా ఏటీసీని అత్యవసర ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి పంపాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు విమానం ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పైర్ దగ్గర ఉన్నది. దీంతో కోల్‌కతా ఏటీసీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా సమీపంలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో దిగాల్సిందిగా సూచించింది. వెంటనే నాగ్‌పూర్‌లో విమానాన్ని ల్యాండ్ చేశారు. కెప్టెన్‌ను హాస్పిటల్‌కు తరలించారు. విమానంలోని ప్యాసింజర్లు అందరూ సురక్షితంగానే ఉన్నారు.

కరోనాతో ఆంక్షలుండటంతో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య విమాన సేవలు నిలిచిపోయాయి. కానీ, ఇటీవలే ఎయిర్‌బుబల్ కింద సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.

click me!