మీరైనా మీ అబ్బాయికి చెప్పండి: మోడీ తల్లికి రైతు లేఖ

By Siva KodatiFirst Published Jan 24, 2021, 6:05 PM IST
Highlights

వాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్‌కు ఓ రైతు లేఖ రాశాడు. 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు కేంద్రం పలు విడతలుగా చర్చలు జరిపింది.

కానీ ఇరు వర్గాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అయినప్పటికీ సర్కార్ వెనక్కి తగ్గేవ వరకు తమ నిరసన విరమించేది లేదని చెబుతున్న రైతులు చలికి తట్టుకుంటూ రోడ్లపైనే దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్‌కు ఓ రైతు లేఖ రాశాడు. 

'బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నాను. దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మూడు నల్ల చట్టాల కారణంగా గడ్డకట్టించే చలిలో గత్యంతరం లేక రోడ్లపై నిద్రపోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90 నుంచి 95 ఏళ్ల వయోవృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.

చలిగాలులతో వారంతా జబ్బు పడుతున్నారు. బలిదానాలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది తలుచుకుంటేనే మా హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి' అని పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు ఆ లేఖలో పేర్కొన్నాడు. 

ఢిల్లీ సరిహద్దుల్లో గట్టకట్టించే చలిలో నిరసన ప్రదేశం నుంచి తాను ఈ లేఖ రాస్తున్నట్టు హర్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థల తరఫున తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాల కారణంగానే ఢిల్లీ సరిహద్దుల్లో తామంతా శాంతియుత ఆందోళన కొనసాగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

కొండంత ఆశతో ఈ లేఖ రాస్తున్నాననీ, మీ కుమారుడు నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాని అయినందున, ఆయనే ఆమోదింపజేసిన సాగు చట్టాలను ఆయనే రద్దు చేయగలడని, తల్లి మాటను తోసిపుచ్చే కొడుకు ఎక్కడా ఉండడనే నమ్మకంతోనే ఈ లేఖ రాస్తున్నానని సింగ్ తెలిపాడు. తల్లి మాత్రమే కొడుకును శాసించగలదు' అని సింగ్ ఆ లేఖలో స్పష్టం చేశాడు.
 

click me!