ఇకపై మరో 7 రాష్ట్రాలకు కొవాగ్జిన్

By Siva KodatiFirst Published Jan 24, 2021, 4:58 PM IST
Highlights

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' వచ్చే వారం నుంచి మరో 7 రాష్ట్రాల్లో పంపిణీ చేయనున్నారు. వీటిలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖాండ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. 

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' వచ్చే వారం నుంచి మరో 7 రాష్ట్రాల్లో పంపిణీ చేయనున్నారు. వీటిలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖాండ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో 'కొవాగ్జిన్' పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

శనివారం సాయంత్రం 6 గంటల వరకూ 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1,46,598 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, జనవరి 16న వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి 15.37 లక్షలకు పైగా లబ్దిదారులు వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించింది.

శనివారం నాడు వ్యాక్సినేషన్ తరువాత దుష్పరిణామాలు చోటుచేసుకున్న 125 ఘటనలు వెలుగుచూసినప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అత్యంత వేగంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇండియా కంటే ముందే వ్యాక్సినేషన్‌‌ ప్రారంభమైన అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే మనదేశంలో అతి తక్కువ సమయంలోనే 10 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి టీకా అందించామని.. ఆదివారం నాటికి ఈ సంఖ్య 16 లక్షలకు చేరుకుందని ఆరోగ్యశాఖ పేర్కొంది.  అయితే, 10 లక్షల మందికి టీకా ఇవ్వడానికి బ్రిటన్‌కు 18 రోజుల సమయం పట్టగా, అమెరికాకు పదిరోజుల సమయం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో 2 లక్షల మందికి టీకా‌ ఇవ్వగా, జనవరి 24 నాటికి దాదాపు 16 లక్షలు (15,82,201) మందికి వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను నమ్మవద్దని, మీ సమయం వచ్చినప్పుడు టీకా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.  

click me!