Omicron: ఒమిక్రాన్ బారిన పడ్డ ఆ ఇద్దరు ఎవరు? వారి ఆరోగ్యం ఎలా ఉంది?

By telugu teamFirst Published Dec 2, 2021, 6:05 PM IST
Highlights

మన దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు కేసులూ కర్ణాటకలోనే రిపోర్ట్ అయ్యాయి. అయితే, వారిద్దరిలో తీవ్ర లక్షణాలేమీ లేవని తెలిపింది. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను ట్రేస్ చేశామని, వారికి టెస్టులు చేస్తున్నట్టు వివరించింది. ఈ ఇద్దరిలో ఒకరు విదేశీయుడు. కాగా, మరొకరు బెంగళూరులో ఆరోగ్య సేవలందించే హెల్త్ కేర్ వర్కర్.

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) ఇప్పుడు మనదేశంలోకీ ప్రవేశించింది. Karnatakaలోని ఇద్దరు ఈ వైరస్ బారిన పడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 29 దేశాల్లో రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయిన దేశాల జాబితాలో మనది బహుశా 30వ దేశం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే 29 దేశాల్లో 373 ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఇతర వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే, అంత ప్రమాదాకరిణి కాదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకైతే ఒమిక్రాన్ బారిన పడి మరణించిన ఉదంతాలు లేవని రెండు రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, మన దేశంలో రిపోర్ట్ అయిన ఆ ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఎవరు? వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అనే విషయాన్ని తెలుసుకుందాం.

మనదేశంలో ఒమిక్రాన్ రెండు కేసులూ కర్ణాటకలో నమోదయ్యాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం వారి వివరాలను వెల్లడించలేదు. కానీ, వీరిద్దరిలో ఒకరు విదేశీయుడు. దక్షిణాఫ్రికా వెళ్లిన ట్రావెల్ హిస్టరీ ఉన్న 66 ఏళ్ల విదేశీయుడు ఒకరు ఉండగా, మరొకరు 46ఏళ్ల మన దేశ పౌరుడే. ఆయన బెంగళూరులోని హెల్త్ వర్కర్‌గా చేసినట్టు తెలిసింది. అయితే, ఈ ఇద్దరిలోనూ ఇప్పటి వరకు తీవ్ర లక్షణాలు ఏమీ లేవని కేంద్రం పేర్కొంది. ఆ ఇద్దరిలోనూ తేలికపాటి లక్షణాలే ఉన్నట్టు వివరించింది.

Also Read: Omicron: భారత్ లో బయటపడ్డ ఒమిక్రాన్, కర్ణాటకలో ఇద్దరికి...

ఈ ఇద్దరితో కాంటాక్టులోకి వచ్చిన వారిని తాము ట్రేస్ చేశామని, ఆ ఇద్దరి ప్రైమరీ కాంటాక్టులు, సెకండరీ కాంటాక్టులను కనుగొన్నామని, వారందరికీ టెస్టులు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే,  అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని, అందరూ తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని వివరించారు. ఎక్కువ మంది ఒక చోట గుమిగూడవద్దని సూచనలు చేశారు. 

Also Read: Omicron: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించారు?.. వారు ఎందుకు భయాందోళన చెందారు..?

కాగా, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఉన్నపళంగా ఒకేసారి ఆంక్షలు విధించడం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అన్నీ అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఐదు రెట్లు వేగంగా వ్యాపించే సామర్థ్యం గలదని కేంద్రం తెలిపింది. అలాగే, మిగతా వేరియంట్లతో పోల్చితే రెండు రెట్లు అధికంగా స్పైక్ మ్యుటేషన్లు గలదని వివరించింది. 

click me!