ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. జీ 20 భారత్ థీమ్‌ను పొగిడారు. ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ నేటి ప్రపంచానికీ వర్తించే సూత్రం అని వివరించారు. ఇది మహా ఉపనిషత్తుల నుంచి స్వీకరించినా.. శాశ్వతమైన ఆదర్శం అని చెప్పారు.
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరాసలో నిర్మాణాత్మకంగా చాలా లోతైన మార్పులు చేయాల్సి ఉన్నదని వివరించారు. ప్రపంచం ఇప్పుడు ఒక కష్టమైన సంధి దశలో ఉన్నదని తెలిపారు. ఈ ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థల సమూహం పర్యావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై చర్చించాలని కోరారు.
ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత అధ్యక్షతన ఈ నెల 9వ తేదీ, 10వ తేదీన జరుగుతున్నాయి. ఈ సదస్సు కోసం హాజరైన ఆంటోనియో గుటెర్రస్ సదస్సు కంటే ముందు మీడియాతో మాట్లాడారు. ఇండియా తామందరికీ ఇచ్చిన గొప్ప స్వాగతానికి ధన్యవాదాలు అని తెలిపారు. జీ 20కి భారత సారథ్యం మన ప్రపంచం నేడు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నో ముఖ్యమైన మార్పులకు దారి చూపిస్తుందని భావిస్తున్నట్టు వివరించారు.
Also Read : ఫార్మాలిటీలు పూర్తయితే.. ఇండియా పేరుమార్పును స్వీకరిస్తాం: ఐక్య రాజ్య సమితి
‘ఒక ధరిత్రి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్’ దృష్టి ని తాను స్వాగతిస్తున్నట్టు యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఈ వాక్యం మహా ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందారని వివరించారు. ఇది ఇప్పటి ప్రపంచానికి కూడా తార్కాణంగా ఉన్నదని తెలిపారు. ఇది శాశ్వతమైన ఆదర్శం అని చెప్పారు. నేడు ప్రపంచంలో పేరుకుపోయిన అపనమ్మకం, ఘర్షణాపూరిత వాతావరణం వంటి వాటికి ఈ పదమే సరైన థీమ్ అని పేర్కొన్నారు. ఈ పదంలోనే పరిష్కారం ఉన్నదని వివరించారు.