కారు ఎక్కుతుండగా కాల్పులు, పరిగెత్తినా వెంటాడి, పట్టపగలే అకాలీదళ్ యువనేత దారుణ హత్య

By Siva KodatiFirst Published Aug 7, 2021, 7:48 PM IST
Highlights

శిరోమణి అకాలీదళ్‌ యువనేత  విక్రమ్‌జీత్‌ సింగ్‌ను వెంటాడి కాల్చి చంపారు దుండగులు. పని ముగించుకొని తన వాహనంలో కూర్చోబోతుండగా.. ముఖానికి ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ఆయన్ను చుట్టుముట్టి తుపాకులు గురి పెట్టారు.
 

పంజాబ్‌లో దారుణం జరిగింది. పట్టపగలే శిరోమణి అకాలీదళ్‌ యువనేతను తుపాకులతో వెంటాడి కాల్చి చంపారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. అకాలీదళ్‌ పార్టీ యువ నేత విక్రమ్‌జీత్‌ సింగ్‌ అలియాస్‌ విక్కీ మిద్ధుఖెరా శనివారం మొహాలీలోని మతౌర్‌ మార్కెట్ వద్దకు వచ్చారు. పని ముగించుకొని తన వాహనంలో కూర్చోబోతుండగా.. ముఖానికి ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ఆయన్ను చుట్టుముట్టి తుపాకులు గురి పెట్టారు.

వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా విక్కీ సుమారు అరకిలోమీటరు దూరం పరుగెత్తారు. కానీ ఆయన సెక్టార్‌ 71 లోని  ప్రాంతంలో ఉన్న ఓ స్థిరాస్తి వ్యాపారం నిర్వహించే ఓ కార్యాలయం వద్దకు చేరుకునే సమయానికి వారు ఆయనపై కాల్పులు జరిపారు. నలుగురు దుండగులు విక్రమ్‌పై సుమారు 20 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. హత్య జరిగిన సమయంలో విక్కీ కారులో లైసెన్సు కలిగిన తుపాకీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆ తుపాకీని చేతిలోకి తీసుకునే అవకాశం అతడికి చిక్కలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. విక్కీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. కాగా, చండీగఢ్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి సంఘానికి గతంలో విక్రమ్‌ జీత్‌ సింగ్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతర కాలంలో ఆయన శిరోమణి అకాలీదళ్ పార్టీ విద్యార్థి విభాగం స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ)లో చేరారు. ఆయన సోదరుడు అజయ్‌ మిద్ధుఖెరా ఇటీవల స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేశారు.  
 

click me!