
Omicron Covid Variant: దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. అలాగే..ఓమిక్రాన్ వేరియంట్ దేశాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది.
గత మూడు రోజుల పాటు ఎటువంటి కేసులు బయటపడకపోవడంతో కూల్ గా ఉన్నారు. కానీ నిన్న ఒక రోజే దేశం వ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32 కు చేరింది. శుక్రవారం నమోదయ్యినా కేసులో మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదు కావడం గమనార్హం. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి సహా ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్టు వైద్యులు నిర్థారించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నివేదిక ప్రకారం.. మహారాష్ట్రలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబయిలో మూడు, పింప్రీ-చించ్వాడ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీరిలో టాంజానియా, యూకే, దక్షిణాప్రికా నుంచి వచ్చారని వారికి ఈ కేసులు నమోదు అయినట్టు అధికారులు చెప్పారు. మరోవైపు .. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టారు. ప్రత్యేకంగా రెడ్ జోన్ దేశాలను నుంచి వచ్చే వారిపై ఎక్కువగా ప్రత్యేక నిఘా పెట్టారు. వారి ట్రావెల్ హిస్టరీని తీసుకుంటున్నారు. ఏయిర్ పోర్టుల్లోనే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించి.. కరోనా పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 17 కేసులు నమోదు కావడం గమనార్హం. రాజస్థాన్ లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటక లో 2, ఢిల్లీ లో ఒక కేసు నమోదయినట్టు అధికారాలు వెల్లడించారు.
మరోవైపు.. కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా.. కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే.. కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. అదే సమయంలో కొత్తగా 7,678 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కొలుకున్నవారి మొత్తం సంఖ్య 3,41,05,066కు చేరింది. ప్రస్తుతం 94,943 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 634 మంది ప్రాణాలు కోల్పోగా.. కేరళలో 225 మంది మరణించారు.
దీంతో అప్రమత్తమైన మహా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో ముంబైలో సెక్షన్ 144 CrPC విధించినట్టు మహా సర్కార్ ప్రకటించింది. ముంబై కమిషనరేట్ పరిధిలో వ్యక్తులు లేదా వాహనాల ర్యాలీలు,మోర్చాలు,ఊరేగింపులు పై నిషేధించారు. ఈ ఆంక్షాలు 48 గంటల పాటు అమల్లో ఉంటుందని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 మరియు ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారం శిక్ష విధించబడుతుందని ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటికే 17 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 7 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 3 కేసులు ముంబైలో నమోదవ్వడం మహారాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది.