ఫైజర్ టీకా మూడు డోసులు తీసుకున్నా.. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

By Mahesh K  |  First Published Dec 18, 2021, 12:47 PM IST

న్యూయార్క్ నుంచి ముంబయి వచ్చిన 29 ఏళ్ల వ్యక్తి ఫైజర్ టీకా మూడు డోసులు వేసుకున్నాడు. అయినా.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడ్డాడు. కానీ, ఆయనలో కరోనా లక్షణాలేవీ లేవు. కరోనా వైరస్ సోకకుండా టీకాలు అడ్డుకోలేవని, అయితే, దాని వల్ల కలిగే తీవ్రతను తగ్గిస్తాయని ఇది వరకే నిపుణులు వెల్లడించిన సంగతి విధితమే. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ విషయంలోనూ అదే నిజమైంది.
 


ముంబయి: కరోనా(Coronavirus) మహమ్మారిని మళ్లీ సోకకుండా టీకాలు(Vaccine) నిలువరించలేవని ఇది వరకే నిపుణులు చెప్పిన విషయం ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విషయంలోనూ నిజమైంది. టీకా వేసుకున్నా రీ ఇన్ఫెక్షన్ అవుతాయని, అయితే, దాని తీవ్రత స్వల్పంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. 29 ఏళ్ల ఓ వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. న్యూయార్క్ నుంచి ముంబయికి వచ్చిన ఆ వ్యక్తి ఫైజర్ టీకా మూడు డోసులు తీసుకున్నారు. అయినా, కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడ్డారు. కానీ, ఆయనలో కరోనా లక్షణాలేవీ లేవు. సింప్టమ్స్ లేకున్నా.. న్యూయార్క్ నుంచి వస్తుండటంతో ఎయిర్‌పోర్టులో నవంబర్ 9వ తేదీన కొవిడ్ టెస్టు చేశారు. ఆ తర్వాత శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

ఆ వ్యక్తికి కరోనా లక్షణాలేవీ లేకున్నా ముందు జాగ్రత్తగా హాస్పిటల్‌లో ఉంచినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివరించారు. కానీ, ఆయనకు కరోనా టెస్టు పాజిటివ్ రాగానే, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు శాంపిల్స్ పంపారు. ఆ టెస్టులో ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆయనకు సన్నిహితంగా ఉన్నవారికీ కరోనా టెస్టు చేశారు. కానీ, వారికి నెగెటివ్‌గా తేలింది.

Latest Videos

undefined

Also Read: Omicron: ఇండియాలో సెంచరీ దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో నమోదు.. అనవసర ప్రయాణాలు వద్దు: కేంద్రం

ఈ కేసుతో వాణిజ్య రాజధాని ముంబయిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 15కు చేరాయి. ఇందులో ఐదుగురు ముంబయికి బయటి వారే ఉండటం గమనార్హం. అయితే, ఇందులో 13 మంది ఇప్పటికే హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. కాగా, మహారాష్ట్రలో రిపోర్ట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో దాదాపు అందరిలోనూ తీవ్ర లక్షణాలేవీ లేకపోవడం గమనార్హం. కాగా, మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 40కి చేరాయి.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సెంచరీ దాటి 101 నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్(Lav Agarwal) వెల్లడించారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 32 ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజస్తాన్‌లో 17 కేసులు, కర్ణాటక, తెలంగాణల్లో ఎనిమిదేసి కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు గుజరాత్, కేరళలలో ఐదేసి ఒమిక్రాన్ కేసులు, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌, చండీగడ్‌లలో ఒక్కో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం 91 దేశాల్లో రిపోర్ట్ అయిందని లవ్ అగర్వాల్ వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తున్నదని అన్నారు. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం డెల్టా కంటే.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయని చెప్పారు. ఒకవేళ కమ్యూనిటీ స్థాయి వ్యాప్తి జరిగితే ఏ దేశంలోనైనా డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ వేరియంట్ అధిగమించి వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అయితే, టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోలేవని చెప్పడానికి ఆధారాలేవీ లేవని వివరించారు.

యూకే తరహాలోనే కేసులు ఇక్కడ రిపోర్ట్ అయితే.. మన దేశంలోని జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ప్రతి రోజూ 14 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యే ముప్పు ఉందని డాక్టర్ వీకే పాల్ అన్నారు. అదే ఫ్రాన్స్ తరహా కేసులు నమోదైతే.. మన దేశంలో రోజుకు 13 లక్షల కేసులు రిపోర్ట్ అవుతాయని వివరించారు.

click me!