11 సార్లు టీకా తీసుకున్న వృద్ధుడిపై చీటింగ్ కేసు నమోదు.. త్వరలో అరెస్టు

By Mahesh KFirst Published Jan 9, 2022, 2:14 PM IST
Highlights

బిహార్‌లో గత వారం ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది ఇప్పటికీ టీకా అంటే భయపడుతున్న తరుణంలో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు టీకా తీసుకున్న ఘటన చర్చనీయాంశం అయింది. తాజాగా, ఆ వృద్ధుడిపై బిహార్‌లో పోలీసు కేసు నమోదైంది. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, చీటింగ్ ఆరోపణలతో సంబంధిత చట్టాల కింద కేసు ఫైల్ అయింది. త్వరలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేయనున్నారు.
 

పాట్నా: కరోనా మహమ్మారిని(Coronavirus) ఎదిరించడానికి అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆయుధం వ్యాక్సిన్(Vaccine). అందరూ తప్పకుండా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. చాలా మంది ఇంకా టీకాపై అపనమ్మకాలను కలిగి ఉన్నారు. భయాలు, సంశయాలతోనే చాలా మంది టీకా వేసుకుంటున్నారు. కానీ, ఆ బిహార్ (Bihar) వ్యక్తి మాత్రం ఎలాంటి జంకు గొంకు లేకుండా గతేడాది 11 సార్లు11 (times) కరోనా టీకా వేసుకున్నాడు. సైడ్ ఎఫెక్టులు కాదు.. కదా.. ఆయనకు ఉన్న కొన్ని వ్యాధులూ నయం అయ్యాయని చెప్పాడు. ఆయన 11 సార్లు టీకా వేసుకున్నాడన్న వార్త బయటకు రాగానే.. దేశమంతటికీ ఆయన తెలిసిపోయారు. ఒక వ్యక్తి అన్ని సార్లు అక్రమంగా టీకా వేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన తీరును తప్పుపట్టడమే కాదు.. ఆరోగ్య శాఖలోని నిర్లక్ష్యాన్ని చాలా మంది ఎత్తి చూపారు. తాజాగా, ఆయనపై చీటింగ్, ఇతర ఆరోపణల కింద కేసు నమోదైంది. త్వరలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేయనున్నారు.

బిహార్‌లో మాధేపురా జిల్లాకు చెందిన బ్రహ్మదేవ్ మండల్ గతేడాది పలుసార్లు టీకా వేసుకున్నారు. ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు చూపెట్టి.. 11 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. 12వ సారి టీకా వేసుకోవాలని భీష్మించుకున్నాడు . కానీ, ఈ సారి ఆయన ఆటలు సాగలేవు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయన 12వ సారి టీకా వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని పసిగట్టారు. ఆయనను పట్టుకుని నిలదీశారు. దీంతో ఆయన నిజం బయటకు కక్కేశాడు. తాను అప్పటికే 11 సార్లు టీకా తీసుకున్నానని ఒప్పుకున్నారు. ఆధార్ కార్డు, వోటర్ కార్డులను ఉపయోగించుకుని అన్ని సార్లు టీకా వేసుకున్నట్టు వెల్లడించారు.

ఈ ఘటనపై ఆరోగ్య  శాఖ తీరుపైనా విమర్శలు వచ్చాయి. వైద్యారోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా పని చేస్తున్నదని కొందరు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ వినయ్ క్రిష్ణ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించారు. బ్రహ్మదేవ్ మండల్‌పై కేసు పెట్టారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణలతో ఐపీసీలోని సెక్షన్ 188, చీటింగ్ ఆరోపణలతో సెక్షన్ 419, 420ల కింద పురెయిని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

బ్రహ్మదేవ్ మండల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. త్వరలోనే ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శనివారం రోజులు దేశంలో 89,28,316 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 1,51,57,60,645కు చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 3,623 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,409 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వివరాలను వెల్లడించాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది.

click me!