
అహ్మదాబాద్: గుజరాత్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. రికార్డు స్థాయిలో సుమారు మూడు వేల కిలోల హెరాయిన్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ. 21వేల కోట్లు పలుకుతుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. గుట్టుచప్పుడు కాకుండా టాల్కమ్ పౌడర్ రూపంలో రెండు కంటెయినర్లలో రవాణా అవుతున్న ఈ మాదకద్రవ్యాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కనీసం వారం రోజులుగా ఈ డ్రగ్స్‌పై పరిశీలనలు జరుగుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్‌కు ఇరాన్ నుంచి ఆంధ్రకు హెరాయిన్ వెళ్లాల్సి ఉన్నదని తెలిపారు. అయితే, ఈ రెండు కంటెయినర్లపై తమకు కొన్ని సంకేతాలతో అనుమానాలు కలిగాయని చెప్పారు. అందుకే గుజరాత్ బుజ్‌లోని ముంద్రా పోర్టుకు ఈ సరుకు రాగానే వెంటనే తనిఖీలు చేశామని వివరించారు. ఇరాన్‌కు చెందిన బందార్ అబ్బాస్ పోర్టు నుంచి ముంద్ర పోర్టుకు ఈ సరుకు వచ్చిందని తెలిపారు. ఇరాన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ కంపెనీ ఈ సరుకును ఆర్డర్ చేసిందని వివరించారు. సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ పౌడర్ పేరిట ఈ సరుకును ఆర్డర్ చేసిందని పేర్కొన్నారు.
మొత్తం 40 టన్నుల బరువున్న ఈ రెండు కంటెయినర్లను నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ నిబంధనల ప్రకారం పరిశీలనలు చేశామని డీఆర్ఐ అధికారులు వివరించారు. ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ నిపుణుల సమక్షంలో పరీక్షలు చేయగా ఆ టాల్కమ్ పౌడర్‌లో హెరాయిన్ ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఒక కంటెయినర్‌లో 1999.579 కిలోల హెరాయిన్, మరో కంటెయినర్‌లో 988.64 కిలోల హెరాయిన్‌ను కనిపెట్టినట్టు వివరించారు.
ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్, గాంధీదామ్, మాండ్విలతోపాటు ఢిల్లీ, చెన్నైల్లో తనిఖీలు చేశామని, ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆఫ్ఘనిస్తాన్ పౌరుల ప్రమేయమూ ఉన్నట్టు తేలిందన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను విచారించడానికి బుజ్ కోర్టు పది రోజుల కస్టడీని ఇచ్చింది.