రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 90 రైళ్లు రద్దు.. 49 రైళ్ల దారి మళ్లింపు..

By Rajesh KarampooriFirst Published Jun 4, 2023, 3:16 AM IST
Highlights

 ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 90 రైళ్లను రద్దు చేయగా, 49 రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా 11 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు 90 రైళ్లను రద్దు చేయగా, 49 రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా 11 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ప్రమాదం కారణంగా ప్రభావితమైన రైళ్లలో ఎక్కువ భాగం దక్షిణ, ఆగ్నేయ రైల్వే జోన్‌లకు చెందినవి. శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది ప్రయాణికులు మరణించగా.. 1000 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. 

భారతీయ రైల్వేలోని రెండు జోన్లు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం..  సౌత్ ఈస్టర్న్ రైల్వే జూన్ 3న నడపాల్సిన చెన్నై-హౌరా మెయిల్, దర్భంగా-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్,  కామాఖ్య-LTT ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసింది. అలాగే.. జూన్ 4న నడపాల్సిన పాట్నా-పూరీ ప్రత్యేక రైలును కూడా రైల్వేశాఖ రద్దు చేసింది. 

దక్షిణ రైల్వే జూన్ 3వ తేదీ రాత్రి 11.00 గంటలకు మంగళూరు నుండి బయలుదేరే మంగళూరు-సంత్రాగచ్చి వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, జూన్ 4వ తేదీ ఉదయం 7.00 గంటలకు చెన్నై నుండి బయలుదేరే డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ - షాలిమార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, డిఆర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, సంత్రాగచ్చి AC సూపర్‌ఫాస్ట్ రైలు కూడా రద్దు చేయబడింది.

జూన్ 3న రంగపర నార్త్ నుండి ఉదయం 05.15 గంటలకు బయలుదేరే రంగపర నార్త్-ఈరోడ్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్, జూన్ 6న గౌహతి నుండి 06.20 గంటలకు బయలుదేరే గౌహతి-శ్రీ ఎం.విశ్వేశ్వరయ్య బెంగుళూరు ట్రై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,  జూన్ 7న మధ్యాహ్నం 02:00 గంటలకు కామాఖ్య నుండి బయలుదేరే  కామాఖ్య-సర్ ఎం.విశ్వేశ్వరయ్య బెంగాల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా దక్షిణ రైల్వే  రద్దు చేసింది. ఈ ప్రమాదం కారణంగా రైల్వే శాఖ 11 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేసింది.

ప్రమాదంలో బాధిత ప్రయాణికుల బంధువులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లేందుకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జూన్ 3న సాయంత్రం 4 గంటలకు హౌరా నుంచి బాలాసోర్‌కు ప్రత్యేక మెము రైలును నడిపింది. ఈ రైలు సంత్రాగచ్చి, ఉలుబెరియా, బగ్నాన్, మచెడా, పన్స్కురా, బలిచక్, ఖరగ్‌పూర్, హిజ్లీ, బెల్డా,జలేశ్వర్‌లలో ఆగుతుంది.

ప్రమాదంలో ప్రభావితమైన వారి బంధువులు/బంధువుల కోసం దక్షిణ రైల్వే చెన్నై నుండి భద్రక్‌కు ప్రత్యేక రైలును కూడా నడుపుతోంది. శనివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. దాదాపు 1,175 మంది ప్రయాణికులు వివిధ ఆసుపత్రులలో చేరారు. వారిలో 793 మంది డిశ్చార్జ్ కాగా.. 382 మంది చికిత్స పొందుతున్నారని ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

click me!