కిడారి- సివేరి సోమ హత్య కేసు: ఒడిషా పోలీసులకు చిక్కిన కీలక నిందితుడు

By Siva KodatiFirst Published Sep 14, 2021, 8:31 PM IST
Highlights

విశాఖ జిల్లా అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో కీలక నిందితుడైన మావోయిస్ట్ కమాండర్‌ను ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. 1987లో ఇంద్రపూరియల్ ఏరియా కమిటీ సభ్యుడైన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు వుంది

విశాఖ జిల్లా అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో కీలక నిందితుడైన మావోయిస్ట్ కమాండర్‌ను ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్తరాసిచెట్లకు చెందిన దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను మంగళవారం ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట పేటగూడ, నౌరా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో డీవీఎఫ్, ఎన్‌వోజీ, బీఎస్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రమేశ్ పట్టుబడ్డాడు. 

సోమవారం ఉదయం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో హార్ట్‌కోర్ మావోయిస్ట్ దుబాసి శంకర్‌ను పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రైఫిల్, 10 రౌండ్ల బుల్లెట్లు, సెల్‌ఫోన్, రేడియో , రూ.35,500ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఒడిషా పోలీసులు తెలిపారు. 1987లో ఇంద్రపూరియల్ ఏరియా కమిటీ సభ్యుడైన రమేశ్‌పై రూ.20 లక్షల రివార్డు వుంది. టీడీపీ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో శంకర్‌పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. 

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2018లో సర్వేశ్వర్‌, సోమలను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 9 మంది మావోయిస్టులపై అభియోగాలు నమోదు చేసింది ఎన్ఐఏ. ఛార్జ్‌షీట్‌లో మావోయిస్ట్ కళావతితో పాటు పలువురి పేర్లు వున్నాయి. మొత్తం 40 మంది పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది ఎన్ఐఏ. ఇన్సార్స్ రైఫిల్స్‌తో ఎమ్మెల్యేపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన అనుచరులతో కలిసి వెళ్తున్నవాహనాన్ని డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్ట దగ్గర మావోయిస్టులు అడ్డగించారు. ఆ తర్వాత ఆయనను కిందికి దించి అతి సమీపం దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతోపాటు సివేరి సోమ అక్కడికక్కడే మృతిచెందారు. 

click me!