భార్య శవాన్ని భుజంపై మోస్తూ కిలోమీటర్లు నడిచిన ఒడిశా వ్యక్తి.. పోలీసులు ఆపి ఏం చేశారంటే?

By Mahesh KFirst Published Feb 9, 2023, 2:03 PM IST
Highlights

ఒడిశాకు చెందిన సాములు పంగి తన భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలోని ఓ హాస్పిటల్‌లో చేర్చాడు. ట్రీట్‌మెంట్‌కు స్పందించిన ఆమెను వెనక్కి తీసుకెళ్లిపోవాలని వైద్యులు సూచించడంతో ఓ ఆటోలో బయల్దేరాడు. కానీ, మార్గంమధ్యలోనే ఆమె మరణించింది. ఆటో డ్రైవర్ కూడా ముందుకు రాకపోవడంతో భార్య శవాన్ని భుజంపై మోస్తూ కొన్ని కిలోమీటర్లు నడిచాడు. ఇంతలో పోలీసులు అతన్ని అడ్డగించారు.
 

హైదరాబాద్: ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల సాములు పంగి తన భార్య శవాన్ని భుజంపైనే కొన్ని కిలోమీటర్లు మోయాల్సి వచ్చింది. తన భార్య గురు అనారోగ్యం బారిన పడింది. చికిత్స కోసం పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చాడు. విశాఖపట్నంలోని ఓ హాస్పిటల్‌లో ఆమెను అడ్మిట్ చేశాడు. కానీ, ఆమె ట్రీట్‌మెంట్‌కు స్పందించడం లేదని, ఆమెను వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 

అక్కడి నుంచి సాములు పంగి ఊరు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హాస్పిటల్ నుంచి ఆమెను ఆటోలో తీసుకుని తన గ్రామానికి బయల్దేరాడు. కానీ, మార్గం మధ్యలోనే 30 ఏళ్ల ఆయన భార్య మరణించింది. దీంతో ఆ ఆటో డ్రైవర్‌ను ముందుకు వెళ్లడానికి నిరాకరించాడు. ఆమె మరణించడంతో శవాన్ని తీసుకుని ముందుకు వెళ్లలేనని కరాఖండిగా చెప్పేశాడు. చెల్లూరు రింగ్ రోడ్డు వద్ద వారిని దింపి వెళ్లిపోయాడు.

Also Read: కుమార్తె మృత దేహాన్ని భుజం పై మోస్తూ.. 10 కిలో మీటర్లు నడుచుకుంటూ... ఓ తండ్రి నిస్సహాయత...

అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక సాములు పంగి సతమతం అయ్యాడు. మరే దారి లేక తన భార్య శవాన్ని భుజంపై మోసుకుని 80 కిలోమీటర్ల దూరంలోని ఊరికి బయల్దేరాడు. కానీ, ఇంతలో దారి మధ్యలోనే పోలీసులు అతన్ని చూశారు. భుజంపై శవాన్ని గుర్తించారు. సాములు పంగిని అడ్డుకున్నారు. ఆయన వివరాలు అడిగి తెలుసుకుని ఆమె డెడ్ బాడీని ఇంటి వద్ద చేర్చడానికి పోలీసులే స్వయంగా ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ ఘటన 2016లో జరిగిన ఓ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఒడిశా లోని భవాని పట్నకు చెందిన దానా మాఝి తన భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి హాస్పిటల్ శవ వాహనాన్ని ఇవ్వకుండా తిరస్కరించింది. దీంతో ఆయనే స్వయంగా తన భార్య ను భుజంపై ఎత్తుకుని సుమారు 12 కిలో మీటర్ల దూరం నడిచారు.

click me!