రాహుల్ గాంధీ మాటలే కాదు.. ఖర్గే మాటలూ పార్లమెంట్ రికార్డుల్లో నుంచి డిలీట్

By Mahesh KFirst Published Feb 9, 2023, 1:08 PM IST
Highlights

రాహుల్ గాంధీతోపాటు మల్లికార్జున్ ఖర్గే మాటలను పార్లమెంటు రికార్డుల్లో నుంచి తొలగించారు. దీనిపై ఆగ్రహిస్తూ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్కడ్‌ను ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ మాటల్లో నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల్లో నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలను తొలగించిన ఒక రోజు తర్వాత తాజాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాటలనూ తొలగించారు. దీంతో గురువారం రాజ్యసభ చైర్‌పర్సన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ను ఈ విషయమై మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. తన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఎందుకు తొలగించారని అడిగారు.

‘నా ప్రసంగంలో ఎవరిపైనా ఆరోపణలు చేసినట్టు, లేదా అన్‌పార్లమెంటరీ పదాలు లేవనే అనుకుంటున్నాను. కానీ, కొన్ని పదాలు మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నారు. మీకు ఏమైనా సందేహం ఉంటే నన్ను భిన్నమైన మార్గంలో అడగవచ్చు. కానీ, మీరు నా ప్రసంగంలో ఆరు చోట్ల పదాలను తొలగించాలని ఆదేశించారు’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా తొలగించారు. అంటే.. ఆయన పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను మీడియా ఏ రూపంలోనైనా ప్రచురించకూడదు. ఈ తొలగింపుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంటులో తమ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం సెన్సార్ చేస్తున్నదని ధ్వజమెత్తాయి.

Also Read: హిడెన్ బర్గ్ నివేదికపై చర్చ: పార్లమెంట్ ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

‘నా వ్యాఖ్యలను ఎందుకు తొలగించారు’ అని కాంగ్రెస్ ఎంపీ అడిగాడు. పార్లమెంటులోకి బుధవారం వెళ్లుతూ ఈ ప్రశ్న వేశారు. బయటకు వస్తూ ఒకరోజు క్రితం తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. ‘నేను అతన్ని చాలా సింపుల్ కొశ్చన్స్ అడిగాను (బిలియనీర్ గౌతమ్ అదానీతో అతని సంబంధం). అతను సమాధానం ఇవ్వలేదు.. ఇది నిజమేంటో వెల్లడిస్తున్నది. ఒక వేళ వారు ఫ్రెండ్స్ కాకుంటే తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇంక్వైరీ చేయడానికి అంగీకరించేవారు. రక్షణ రంగంలోనూ షెల్ కంపెనీల పెట్టుబడుల ఆరోపణలపైనా ఆయన స్పందించలేదు’ అని పేర్కొన్నారు. 

అదానీ గ్రూపు కంపెనీలపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇవ్వాలని, ప్రధాని మోడీ తమ ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

click me!