బీఆర్ఎస్‌లోకి త్వరలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!.. బీజేపీకి తండ్రీ తనయుల రాజీనామా

By Mahesh KFirst Published Jan 25, 2023, 8:10 PM IST
Highlights

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడూ ఇద్దరూ కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఇప్పటికే వారిద్దరూ కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
 

భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు శిశిర్‌లు బీజేపీ నుంచి బయటకు వచ్చారు. త్వరలోనే కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరనున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కేసీఆర్‌తో ఈ తండ్రీ తనయులు భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే పార్టీలో చేరే అంశంపై మాట్లాడినట్టు తెలిసింది. త్వరలోనే వారు మరో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్‌లో చేరే తేదీని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, 2024 ఎన్నికలకు గిరిధర్ గమాంగ్ సారథ్యంలోనే ఒడిశాలో బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగుతుందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండ్రీ తనయులు త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది.

1999 ఫిబ్రవరి నుంచి 1999 డిసెంబర్ వరకు ఒడిశాకు ముఖ్యమంత్రిగా చేసిన గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా, బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖలో ఆయన ఎవరినీ బ్లేమ్ చేయలేదు. కానీ, పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఓటు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు డిబేట్‌లో స్పష్టపరిచినందుకు ధన్యవాదాలు అని 9 సార్లు ఎంపీగా గెలిచిన 79 ఏళ్ల గిరిధర్ గమాంగ్ తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిబంధనలకు లోబడి వ్యవహరించానని, అప్పుడు ఎంపీగా ఇంకా రాజీనామా చేయకమునుపే ఓటు వేయాల్సి రావడంతో ఫిర్యాదుల చట్టానికి లోబడి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. గతంలోనూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పటి తరహాలోనే ఇప్పుడు కూడా బీజేపీకి రాజీనామా చేస్తూ ఎవరినీ తప్పుపట్టడం లేదని తెలిపారు.

Also Read: నేను చెప్పేది వాస్తవం కాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాలు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కష్టసమయంలో తాను బీజేపీకి రాజీనామా చేసేలా పురికొల్పారని పేర్కొన్నారు. తాను గతంలో ఓ జాతీయ పార్టీ నుంచి బయటకు వచ్చి మరో జాతీయ పార్టీలో చేరానని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా మరో జాతీయ పార్టీలో చేరడానికి అవకాశం ఉన్నదని వివరించారు. ఒక జాతీయ పార్టీని నిర్మించడానికి సమయం పడుతుందేమో గానీ, దీన్ని తన బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. బీజేపీలో కొనసాగినప్పుడు తనపై ఉంచిన గౌరవానికి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు అని తెలిపారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో గమాంగ్ తండ్రీ తనయులు ఈ నెలలోనే లంచ్ చేశారు. తాము త్వరలోనే కేసీఆర్ పార్టీలో చేరబోతున్నట్టు గిరిదర్ గమాంగ్ తనయుడు శిశిర్ సంకేతాలు ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి విజన్ నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణలో ఆయన సాధించిన విజయాలు అమోఘం అనే తరహాలో వ్యాఖ్యలు చేసినట్టు కొన్ని వర్గాలు వివరించాయి.
 

click me!