
పూణె: మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించిన ఘటన కలకలం రేపింది. భీమా నదిలో ఏడుగురి మృతదేహాలు కనిపించాయి. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తొలుత ఇది మూకుమ్మడి ఆత్మహత్యలు అనే అనుమానాలు వచ్చాయి. కానీ, ఇది మాస్ సూసైడ్ కాదు.. ప్రీప్లాన్‌డ్ మర్డర్ అని పోలీసులు చెబుతున్నారు. పక్కా ప్లాన్‌తో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేయాలని నలుగురు అన్నదమ్ములు చేసిన అఘాయిత్యమే ఈ హత్యలు అని వివరిస్తున్నారు. కుటుంబాన్ని మొత్తం హత్య చేయాలని నిర్ణయించుకోవడానికి ఒక అనుమానమే వారిని ప్రేరేపించిందని పేర్కొంటున్నారు.
పూణె జిల్లాలో దౌండ్ సమీపంలో పార్గావ్ దగ్గర భీమా నదిలో ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీల మధ్య ఏడు మృతదేహాలు కనిపించాయి. ఈ మృతదేహాలు కొట్టుకు రావడంతో స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆధారాల కోసం దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టులో వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. అంతేకాదు, అందరూ నీట మునిగే మరణించారని తెలిసింది. మృతుల్లో నలుగురు పెద్దవారున్నారు. ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తొలుత ఇది ఆత్మహత్యలుగా కనిపించినా.. పోలీసులు మాత్రం మర్డర్ కోణంలోనూ దర్యాప్తు చేశారు.
ఈ కేసులో ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన అభియోగాలతో పోలీసులు బుధవారం నలుగురు అన్నదమ్ములను అరెస్టు చేశారు.
Also Read: నదిలో రోజుల వ్యవధిలో కొట్టుకొచ్చిన ఏడు మృతదేహాలు..అంతా ఒకే ఫ్యామిలీ, హత్యా, ఆత్మహత్యా..?
తాజాగా, ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన 50 ఏళ్ల వ్యక్తికి అరెస్టు చేసిన నలుగురూ కజిన్స్ అని పోలీసులు వివరించారు. అరెస్టు చేసిన వారిలో ఒకరి కొడుకు కొన్ని నెలల క్రితం లోనికాండ్ దగ్గర రోడ్డు ప్రమాదం లో మరణించాడ ని చెప్పారు. అయితే, తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, తమ కజినే చంపేశాడనే అనుమానాలు పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తి తన ముగ్గురు సోదరులతో కలిసి తమ కజిన్ ఫ్యామిలీ మొత్తాన్ని అంతమొందించాలని కుట్ర చేశారని పూణె రూరల్ పోలీసు, ఏఎస్పీ ఆనంద్ బోయితె తెలిపారు.
ఆ నలుగురు అన్నదమ్ములు జనవరి 18వ తేదీన తెల్లవారు జామున 50 ఏళ్ల తమ కజిన్‌ను, ఆయన భార్య, కూతురు, అల్లుడు, ముగ్గురు మనవళ్లను భీమా నది లో తోసేసి చంపేశారని వివరించారు. ఈ ఘటన అక్కడ స్థానికంగా కలకలం రేపుతున్నది.