విద్యార్థులకు కరోనా పాఠాలు.. 11వ తరగతి సిలబస్‌లో చేర్చిన అధికారులు

By telugu teamFirst Published Sep 12, 2021, 12:28 PM IST
Highlights

కరోనా మహమ్మారిపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేలా వారి సిలబస్‌లోకి దీనిపై పాఠ్యాంశాలను చేర్చారు. 11వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచి కరోనాపై పాఠాళు వినబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచే పై అన్ని తరగతుల్లోనూ కరోనా పాఠాలు బోధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తున్నది.
 

కోల్‌కతా: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ గురించి విద్యార్థులు ఇక విధిగా చదవనున్నారు. విద్యార్థుల సిలబస్‌లో కరోనాను అధికారులు చేర్చారు. 11వ తరగతి విద్యార్థులు కరోనా మహమ్మారిపై పాఠాలు వినబోతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌పు పాఠ్యాంశాలను చేర్చింది.

ఈ నూతన అధ్యాయంలో కరోనా వైరస్ అంటే ఏమిటి? అదెలా ఇతరులకు సోకుతుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? క్వారంటైన్ అంటే ఏమిటి? ఇలా వైరస్ చుట్టూ ఉన్న అనేక అంశాలను పొందుపరిచారు. తద్వారా వైరస్ గురించిన అవగాహన పిల్లల్లో రానుంది.

లక్షణాలు గురించే కాదు, వైరస్ సోకిన పేషెంట్ల నుంచి ఉండాల్సిన సేఫ్ డిస్టెన్స్ ఎంత? ఇతర ముందు జాగ్రత్తల గురించీ అధ్యాయం చర్చించనుంది. మరొక ఆసక్తికర విషయమేంటంటే ఈ అధ్యాయం కేవలం కరోనా వైరస్‌కే పరిమితం కాలేదు. దీనితోపాటు మరికొన్ని వైరస్‌లపైనా వివరాలను అందిస్తున్నది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరోనా వైరస్ పాఠాలను ఆరో తరగతి సిలబస్‌లోనూ చేర్చాలని భావిస్తున్నారు. అడ్వైజరీ కమిటీనే ప్రభుత్వానికి ఇలాంటి సూచనలు చేసింది. సరికొత్త ఐడియాలతో రావాలని కోరగా, ఈ ఐడియాను ప్రభుత్వ అధికారులు ముందుకు తెచ్చారు. వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి కంటే పై తరగతులన్నింటిలో కరోనా పాఠాలు పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తున్నది.

‘ఈ మహమ్మారి మన జీవితాలను మార్చేసింది. మన ఆప్తులను దూరం చేసింది. అలాంటి వైరస్ గురించి కనీస అవగాహన కలిగి ఉండటం అవసరం’ అని విద్యాశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. 

‘కరోనా వైరస్ ఇప్పుడప్పుడే అంతమయ్యేది కాదు. కాబట్టి, దీర్ఘకాలం మనతోపాటే ఉండే ఈ వైరస్ గురించి తెలుసుకోవడం మంచి నిర్ణయం. పిల్లలు దీనిపై ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే వైరస్‌ను సకాలంలో కనుగొని, చికిత్స అందించడం సులువు అవుతుంది. కరోనా పూర్తిగా అంతమైనప్పటికీ చారిత్రకంగా దాని గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంటుంది’ అని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ యోగిరాజ్ రాయ్ అన్నారు. బాల్యం నుంచే దీనిపై అవగాహన ఏర్పడటం సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, కరోనాపై ఏర్పడ్డ అనవసర భయాలు దూరమవుతాయని మరో నిపుణులు కాజల్ క్రిష్ణ బానిక్ వివరించారు.

click me!