నేడే నీట్ ప్రవేశ పరీక్ష: డ్రెస్‌కోడ్ పాటించాల్సిందే

By narsimha lodeFirst Published Sep 12, 2021, 11:29 AM IST
Highlights

దేశంలో ఇవాళ నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  ఈ పరీక్షలకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.


న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆదివారం నాడు  నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు 16 లక్షలకు పైగా నమోదైన  అభ్యర్ధులు హాజరుకానున్నారు.  నీట్ పరీక్షల కోసం అబ్బాయిలు, అమ్మాయిల కోసం ప్రత్యేకమైన మార్గదర్శకాలు, డ్రెస్‌కోడ్ విధించారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీన  నీట్ ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేశారు.

ఆడ్మిట్ కార్డులో పేర్కొన్నట్టుగా రిపోర్టింగ్ సమయం ప్రకారంగా అభ్యర్ధులు  పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అభ్యర్ధులు  కరోనా మార్గదర్శకాలను పాటించాలని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు డ్రెస్ కోడ్ ను పాటించాలని తేల్చి చెప్పింది కేంద్రం.పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులంతా మాస్క్‌ను ధరించాల్సిందే. 

నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అన్ని సబ్జెక్టుల్లోని 200 ప్రశ్నల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందే. ఈడబ్ల్యుఎస్ వర్గాలకు జాతీయ సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 10 సీట్లు రిజర్వ్ చేశారు.
27 శాతం రిజర్వేషన్లు ఓబీసీ అభ్యర్ధులకు రిజర్వ్  చేశారు.

నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే సదరు విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి.  అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. తక్కువ ఎత్తు ఉండే చెప్పులు మాత్రమే వేసుకోవాలి.

వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్‌ బ్యాగులు వంటివి తీసుకురావొద్దు.  పెన్సిల్, కాలిక్యులేటర్, స్కేల్, రైటింగ్‌ ప్యాడ్‌ వంటివి కూడా అనుమతించరు. మొబైల్‌ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, హెల్త్‌బ్యాండ్, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావొద్దు. అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోవద్దు.

click me!