
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరవ్వాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ దర్యాప్తులో భాగం కావాలని ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఫ్రంట్ గేట్‌ను కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పండిట్లపై దారుణాలు అని చిత్రీకరిస్తున్నవన్నీ అబద్ధాలేనని కేజ్రీవాల్ చేసిన కామెంట్‌లను వారు వ్యతిరేకించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సారథ్యంలో ఆందోళనలు జరిగాయి.
ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కశ్మీర్ పండిట్ల అగచాట్లను వివరిస్తూ ది కశ్మీర్ ఫైల్స్ అనే బాలీవుడ్ సినిమా వచ్చింది. ఈ సినిమాను బీజేపీ నేతలు ఆదరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా మట్టుకు ఈ సినిమాపై ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ మినహాయించాయి. అందరూ ఈ సినిమా చూడాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బీజేపీపై విమర్శలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆ సినిమాకు పన్ను కూడా మినహాయించాయని కేజ్రీవాల్ అన్నారు. ఆ సినిమా నిజంగా అందరూ చూడాలని బీజేపీ భావిస్తే.. దానికి ట్యాక్సులు మినహాయించడమేం ఖర్మ.. నేరుగా యూట్యూబ్‌లో వేస్తే సరి.. అందరూ సినిమాను చూస్తారు కదా అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్ల అగచాట్లను కూడా వారు సొమ్ము చేసుకుంటున్నారని, మీరు మేల్కొనాలని బీజేపీ కార్యకర్తలకు సూచనలు చేశారు. కాబట్టి, ఆ పార్టీ వదిలి.. తమ పార్టీలో చేరాలని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీజేపీ శ్రేణులు కేజ్రీవాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలో బీజేపీ యువమోర్చా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి.
ఈ ఆందోళనల్లో భాగంగా మార్చి 30న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సారథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేశారు. ఆ నిరసనకారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై దాడి చేసేంత వరకు వెళ్లారు.
కశ్మీరీ హిందువులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పే వరకు నిరసనలు చేస్తామని ఆయన తెలిపారు. రామ మందిరం, హిందువుల దేవుళ్లు, సర్జికల్ స్ట్రైక్స్‌ను అవహేళన చేయడం ఆమ్ ఆద్మీ పార్టీకి అలవాటుగా మారిందని సీరియస్ అయ్యారు.