Yogi vs Akhilesh: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అఖిలేష్, రాహుల్ గాందీకి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఒకరేమో దేశాన్ని విదేశాల్లో విమర్శిస్తుంటారు. మరొకరు యూపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లి యూపీని విమర్శిస్తారని.. అఖిలేష్ యాదవ్ పై సీఎం యోగి ఛలోక్తి విసిరారు.
Yogi vs Akhilesh: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అసెంబ్లీలో ప్రసంగిస్తూ .. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య పోలిక పెట్టారు. అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీల మధ్య చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదని సీఎం యోగి పేర్కొన్నారు. ఒకరు రాష్ట్రం బయటకు వెళ్లి స్వరాష్ట్రంపై విమర్శలు చేస్తేంటే.. మరోకరు విదేశాలకు వెళ్లి సొంత దేశంపై విమర్శలు గుప్పిస్తారని అన్నారు.
అంతకు ముందు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తాను ఓ పాఠశాలను సందర్శించినప్పుడూ ఓ విద్యార్థి తనని చూసి రాహుల్ గాంధీ అని పిలిచాడని పేర్కొన్నారు. ఈ సంఘటనను ప్రస్తావించిన యోగి.. చిన్నారులు అమాయకులు కావొచ్చేమో గానీ, ఆ విద్యార్థి మాత్రం కొంచెం ఆలోచించే ఆ విధంగా సంబోధించి ఉంటారని సెటైర్లు వేశారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి. ఆ సమయంలో అఖిలేష్ కూడా అసెంబ్లీలోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా, మంగళవారం నాడు వాయిదా వేయబడటానికి ముందు.. యోగి ఆదిత్యనాథ్ సిఎంగా రెండో సారి పదవీ చేపట్టిన అనంతరం 6.15 లక్షల కోట్ల రూపాయల విలువైన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిని అసెంబ్లీ ఆమోదించింది.
ఇదిలావుండగా, గత ఐదేళ్లలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌పై సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు మంగళవారం ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి వాకౌట్ చేశారు. ప్రభుత్వం ప్రశ్నపత్రాలను లీక్ చేసి రూ.2-4 లక్షలకు విక్రయిస్తోందని ఆరోపించారు. 2017లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పోటీ పరీక్షల పేపర్లు నిరంతరం లీక్ అవుతున్నాయని ఎస్పీ సభ్యుడు మాన్ సింగ్ యాదవ్ ఆరోపించారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆయన అన్నారు. అనంతరం 2018 ఫిబ్రవరిలో యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరీక్ష పేపర్ లీకైంది.. జూలై 2018లో సబార్డినేట్ సెలక్షన్ కమిషన్ పేపర్ కూడా లీక్ అయిందని.. ప్రభుత్వం పోటీ పరీక్షల నిర్వహణలో సీరియస్‌గా వ్యవహరించకపోవడం వల్ల నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. తాజాగా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనీ, యువత భవిష్యత్తుపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన ఆరోపించారు. అదేసమయంలో.. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రశ్నపత్రాలను లీక్ చేసి రూ.2-4 లక్షలకు విక్రయిస్తున్నారని ప్రతిపక్ష నేత లాల్ బిహారీ యాదవ్ ఆరోపించారు. ఈ చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
ప్రతిపక్ష ఆరోపణలను బీజపీ మంత్రి జస్వంత్ సైనీ ఖండించారు. అన్ని పోటీ పరీక్షలు పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమయంలో గత ఐదేళ్లలో వివిధ శాఖల్లో ప్రభుత్వం చేసిన నియామకాలను మంత్రి ప్రస్తావించారు. వివిధ శాఖలలోని నియామకాలకు నిర్వహించిన పరీక్షల గురించి సభకు వివరించారు. సమాధానంతో సంతృప్తి చెందని ఎస్పీ సభ్యుడు మాన్ సింగ్ యాదవ్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు.