Population control bill: దేశంలో జనాభా నియంత్రణకు త్వరలో చట్టం..!

By Rajesh K  |  First Published Jun 1, 2022, 9:03 AM IST

Population control bill: దేశంలో జనాభా నియంత్రణ చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు.
 


Population Control Bill: మ‌న‌ దేశంలో జనాభా నియంత్రణ కోసం బీజేపీ కేంద్రం ఓ చట్టాన్ని రూపొందించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. పెరుగుతున్న జనాభాను నియంత్రించ‌డానికి త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్​ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలకు దారితీశాయి.  

మంగళవారం ఆయ‌న రాయ్‌పూర్‌-బరోండాలోని ICAR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌లో నిర్వ‌హించిన‌ 'గరీబ్​ కల్యాణ్​ సమ్మేళన్​'లో పాల్గొన్నారు. అనంత‌రం నిర్వ‌హించిన‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంలో 'జనాభా నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?' అని మంతి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్​ ని ఓ రిపోర్ట‌ర్  ప్రశ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానమిస్తూ.. "ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదు. కేంద్రం త్వరలోనే జనాభా నియంత్రణ కోసం చట్టాన్ని తీసుక‌రానున్న‌ది. ఇప్పటికే కేంద్రం ఎన్నో శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంది. జనాభా నియంత్రణ కోసం కూడా చర్యలు చేపడుతుంది," అని మంత్రి పటేల్​ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఛత్తీస్​గఢ్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రహ్లాద్​ సింగ్​. కేంద్ర పథకాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Latest Videos

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారి తెగించ‌డంపై ఆయన మాట్లాడుతూ.. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితి గురించి మాట్లాడే వారు.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఉన్న కాలంతో ప్రస్తుతాన్ని పోల్చండనీ, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న హ‌త్య‌ల వెనుక పాకిస్తాన్,  పాకిస్తాన్ మద్దతు దారులు ఉన్నారు. 24 గంటలు ఆగితే హంతకుడు ఎక్కడ ఉంటాడో తెలిసిపోతుంది అన్నది కూడా నిజం. అని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఇదే చివరి ప్రయత్నమని, భారత ప్రభుత్వం, భార‌త‌ సైన్యం, పారామిలటరీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పూర్తి అంకితభావంతో తమ విధులను నిర్వర్తిస్తున్నార‌నీ, ఉగ్రవాదులను ఏరివేస్తారనీ తెలిపారు. 

కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు 

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధికార పార్టీ కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు. కొన్ని కేంద్ర పథకాల లక్ష్యాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నెరవేర్చ‌డం లేదన్నారు.

చత్తీస్‌గఢ్‌లో జల్ జీవన్ మిషన్ పనులు 23 శాతం జరిగాయని, దేశంలో సగటున 50 శాతం పనులు జరిగాయని పటేల్ అన్నారు. ఇక్కడ నీటి వనరుల సమస్య లేదని, నిర్వహణ సమస్య ఉందని అన్నారు.  ఇది పాల‌కుల‌ తప్పుల ఫలితమ‌నీ, అలాగే రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యం కూడా నెరవేరలేదని ఆరోపించారు.

అంతకుముందు 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో పటేల్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ మూల మంత్రం సేవ, సుపరిపాలన, పేద సంక్షేమమేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో స్వావలంబన బాటలో పయనిస్తూ.. నేడు భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఎదుగుతుందన్నారు. సమ్మిళిత వృద్ధిరేటుతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతూ దేశంలోని చివరి వ్యక్తి జీవన ప్రమాణాలను పెంచ‌డ‌మే ప్ర‌భుత్వ ఉద్దేశమ‌ని అన్నారు.

click me!