
బీజేపీకి (bjp) మజ్లిస్ పార్టీ (aimim) బీ టీమ్ కాదన్నారు ఎంఐఎం మహారాష్ట్ర చీఫ్, ఎంపీ ఇంతియాజ్ జలీల్ (imtiaz jaleel) . అవసరమైతే కాంగ్రెస్‌తోనూ (congress) జట్టు కడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ (ncp), కాంగ్రెస్‌తో జట్టుకు తాము సిద్ధమని ఇంతియాజ్ జలీల్ పేర్కొన్నారు. శుక్రవారం ఎన్సీపీ నేత, రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపె (rajesh tope) తన ఇంటికి వచ్చారని, ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఇంతియాజ్ వెల్లడించారు. తన తల్లి చనిపోవడంతో పరామర్శ కోసమే తోపె వచ్చారని తెలిపారు. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మజ్లిస్ పార్టీ బీ టీమ్ లా వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్నారని ఇంతియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందులో నిజం లేదని... అందులో భాగంగానే ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకడతామంటూ తోపెకు చెప్పానని వెల్లడించారు. మరి వారి నుంచి సానుకూల స్పందన వస్తుందా లేదా మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తారా? అనేది చూడాలని ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈ పార్టీలన్నింటికీ ముస్లింల ఓట్లు కావాలని.. ఒక్క ఎన్సీపీనే కాదు, కాంగ్రెస్ కు కూడా అవసరమేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్ల కోసం మేం చేతులు కలిపేందుకు సిద్ధమేనని ఇంతియాజ్ వెల్లడించారు. దేశానికి బీజేపీ భారీ నష్టాన్ని చేసిందని.. దాన్ని సరిదిద్దేందుకు ఆ పార్టీని ఓడించడమే మా లక్ష్యం అని ఇంతియాజ్ పేర్కొన్నారు.
కాగా.. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. బిహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఖాతా తెరిచింది. అయితే బెంగాల్, తమిళనాడులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక, తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (up election 2022) ఎంఐఎం తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న చోట్లలో అభ్యర్థులను నిలిపింది. యూపీలో 100 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని చెప్పిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi).. పలు ప్రాంతాల్లో అభ్యర్థులను పోటికి దించారు.
అయితే యూపీ ఎన్నికల్లో ఎంఐఎం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. ఎంఐఎం భారీ సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టినా కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం గమనార్హం. అయితే తూర్పు యూపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్పీ ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపినట్టుగా సమాచారం. ఇక, యూపీలో ఎంఐఎం అభ్యర్థుల తరఫున అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న సమయంలో అసదుద్దీన్ వాహనంపై దుండగులు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.