
న్యూఢిల్లీ: భారత అతిపెద్ద ఆయిల్ కంపెనీ రష్యాతో డీల్ కుదుర్చుకుంది. రష్యా నుంచి తక్కువ ధరకే మూడు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం ఫైనలైజ్ అయింది. ఇది కంపెనీ, కంపెనీకి మధ్య ఉన్న ఒప్పందం అని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో అమెరికా, పశ్చిమ దేశాలు.. పుతిన్ దేశంపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల నుంచి ఉపశమనం పొందడానికి రష్యా ప్రభుత్వం దాని మిత్ర దేశాలకు ముడి చమురు, ఇతర సరుకులను భారీ తగ్గింపుతో అమ్ముకోవాలని చూస్తున్నది.
కాగా, 80 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే భారత్.. రష్యా చేసిన ఆఫర్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నది. ముఖ్యంగా చౌకగా లభించే ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్టు ఇది వరకే ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తాజాగా, భారత్‌లో అతిపెద్ద ఆయిల్ కంపెనీ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రష్యాతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం వచ్చింది. ఇది ప్రభుత్వంతో కాకుండా.. కంపెనీ, కంపెనీకి మధ్యనే ఒప్పందం కుదిరిందని కొందరు చెప్పారు.
రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే.. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల నుంచి రష్యా ఎంతో ఉపశమనం పొందుతుంది. కాబట్టి, తమ ఆంక్షలు సజావుగా అమలు కావడానికి ప్రపంచ దేశాలు సహకరించాలని, పశ్చిమ దేశాలు, అమెరికా సూచనలు చేశాయి. కానీ, భారత్ మాత్రం చట్టబద్ధంగా చేసుకునే దిగుమతులను రాజకీయం చేయవద్దని స్పష్టం చేసింది. విదేశీ దిగుమతలపై ఆధారపడే దేశాలు రష్యా నుంచి చమురును కొనుగోలు చేసుకోవడాన్ని ఆంక్షల ఉల్లంఘనగా పరిగణించరాదని పేర్కొంది.
ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో అత్యంత చౌకగా భారత్‌కు అందివస్తున్న చమురు రష్యాదేనని, రష్యాతో చమురుపై డీల్ ఎన్నో ప్రయోజనాలు కలిగించనుందని నిపుణులు చెబుతున్నారు. అదే సందర్భంలో భారత ఆయిల్ సంస్థ రష్యా కంపెనీల నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఏ ఆంక్షలు అడ్డుకోలేవని వివరిస్తున్నారు. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బాటలోనే మన దేశానికి చెందిన మరికొన్ని ఆయిల్ కంపెనీలూ.. రష్యా కంపెనీలతో ఒప్పందాలను తుది దశకు తీసుకువస్తున్నాయి.
చమురును భారత్‌కు రవాణా చేసేందుకు అయ్యే ఖర్చును, బీమాను రష్యా స్వయంగా భరించనున్నట్టు ఇటీవలే ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరులో భారత్ తన వైఖరిని తటస్థ వైఖరి ప్రదర్శించింది. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని పట్టుబట్టింది. ఐక్యరాజ్యసమితిలో ఈ అంశంపై జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. మరోవైపు రష్యా నుంచి అతి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే.. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని అమెరికా పేర్కొంది. కాగా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసే ప్రతిపాదనను భారత్ పరిశీలిస్తోందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం రాజ్యసభలో తెలిపారు. రాయితీపై చమురు కొనుగోలు చేయడం వల్ల భారతదేశానికి చమురు ధర తగ్గుతుందని ఆయన చెప్పారు. ఒప్పందం తర్వాత రష్యా త్వరలో భారత్‌కు చమురును సరఫరా చేయగలదని ప్రముఖ వార్తా సంస్థలు తెలిపాయి.