
Uttar Pradesh Chief Minister Yogi Adityanath: సహకార చెరకు, చక్కెర మిల్లు సొసైటీల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాల బ్యాంకుల కోసం 77 ట్రాక్టర్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరకు రైతులకు చారిత్రాత్మకమైన రోజు కాబోతోందనీ, హోలీ సందర్భంగా రూ .2 లక్షల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా పంపబడతాయని తెలిపారు. 2017కు ముందు సాగునీరు, కరెంటు, సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని చెరకు రైతులు తమ పంటలను తగలబెట్టుకోవాల్సి వచ్చేదని పేర్కొన్న ఆయన.. తమ పాలనలో రైతుల ఇబ్బందు లేకుండా పోయాయని అన్నారు. గత ఆరేళ్లలో ఉత్తరప్రదేశ్ లో ఏ ఒక్క రైతు కూడా నిస్సహాయంగా ఉండి ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు.
చెరకు రైతులను దళారుల బారి నుంచి విడిపించామనీ, నేడు రైతులు స్లిప్పుల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా.. స్మార్ట్ ఫోన్ లో వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలోని 77 చెరకు కమిటీలకు నేడు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు అందుతున్నాయన్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలాంటి కానుకను అందుకోవడంతో చెరకు రైతుల ఆనందం రెట్టింపు కానుందని తెలిపారు. "గతంలో చెరకు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ ఎజెండాలోనూ రైతును చేర్చి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడం ప్రారంభించారు. గతంలో వడ్డీ వ్యాపారులపై ఆధారపడిన ప్రతి రైతు ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డు, కిసాన్ బీమా యోజన, వ్యవసాయ నీటి పారుదల పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి ప్రయోజనం పొందగలుగుతున్నాడని యోగి అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.60 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, గత మూడున్నరేళ్లలో రూ.51 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేసే పని చేశామని చెప్పారు. రైతు అంటే కేవలం రైతు మాత్రమేననీ, కుల-మత-జాతులు లేవని అన్నారు. 2017కు ముందు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేదో మనందరికీ తెలుసని పేర్కొంటూ.. నేడు 22 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించామన్నారు. నేడు యూపీ దేశంలో కొత్త రికార్డును సృష్టించబోతోందని, మొత్తం రూ .2 లక్షల కోట్లకు పైగా చెరకు చెల్లింపులు ఇప్పుడు మొదటిసారిగా రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతున్నాయని అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రెండు లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ కూడా లేదని ఆయన తెలిపారు. చెరకు రైతుల కృషి వల్లే హెక్టారుకు అదనంగా 10 టన్నుల చెరకు దిగుబడి వస్తోందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు.
కోవిడ్ -19 కాలంలో, దేశవ్యాప్తంగా శానిటైజర్ల కొరత ఉన్నప్పుడు, ప్రభుత్వం ఈ చక్కెర మిల్లుల ద్వారా యూపీలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు ఉచితంగా శానిటైజర్లను అందుబాటులో ఉంచింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలకు శానిటైజర్లను అందించిదని తెలిపారు. చెరకు ధరను తమ ప్రభుత్వం సకాలంలో చెల్లించిందని, గోధుమలు, వరి ధాన్యాన్ని అధిక కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. "రైతులకు పంటలు ఉన్నంత వరకు, ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుంది. ఏ రైతు కూడా తిరగాల్సిన అవసరం ఉండదు. ఖడ్సారి (Khadsari units) యూనిట్లకు 284 లైసెన్సులు జారీ చేశామనీ, ఫలితంగా ఉద్యోగ కల్పన" జరిగిందన్నారు. చెరకు రైతుల ద్వారా దేశంలోనే అత్యధికంగా గ్రీన్ ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.