
వాషింగ్టన్ : భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ 2023 అవార్డుకు ఎంపికయ్యారు. స్వాతి నాయక్ ను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్త అంటూ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. స్వాతి నాయక్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తోంది.
చిన్న, సన్న కారు రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో స్వాతి నాయక్ విశేషమైన కృషి చేశారని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ కొనియాడింది. డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు కృషి చేసే 40ఏళ్లలోపు శాస్త్రవేత్తలను దీనికి ఎంపిక చేస్తుంది. ఈ యేడు స్వాతి నాయక్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
అక్టోబర్లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకుంటారు. నార్మన్ బోర్లాగ్ అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి. నోబెల్ పురస్కార గ్రహీత. ఈ అవార్డు అందుకుంటున్న డాక్టర్ స్వాతి నాయక్ భారత్లోని ఒడిశాకు చెందిన వ్యక్తి. 2003 - 2007లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్నారు స్వాతి నాయక్.