
రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఏ రాష్ట్రానికీ ‘‘ప్రత్యేక కేటగిరీ హోదా’’ డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని స్పష్టం చేశారు. కొన్నేళ్లు దేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా ఒడిశాలో పర్యటించిన నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ఒడిశా ఒత్తిడిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్.. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఫైనాన్స్ కమిషన్ స్పష్టంగా చెప్పిందని అన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక హోదా కల్పన అంశాన్ని కూడా నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు. అనేక రాష్ట్రాల నుంచి ఇటువంటి డిమాండ్లు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఫైనాన్స్ కమిషన్ స్పష్టమైన అభిప్రాయం చెప్పిందని తెలిపారు.
ఇక, కొండ ప్రాంతాలు, వ్యూహాత్మక అంతర్జాతీయ సరిహద్దులు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటుతనం వంటి సామాజిక-ఆర్థిక ప్రతికూలతలు కలిగిన రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చడానికి 1969లో ప్రత్యేక కేటగిరీ హోదా ప్రవేశపెట్టబడింది. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు మాత్రమే హోదా కల్పించారు.
అయితే ప్రత్యేక హోదా కోసం పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని ఏపీ ప్రాంత నాయకులు, ప్రజలు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీలు పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు.
ఇక, ఒడిశా, బీహార్ ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్రం ఒత్తిడి చేస్తున్నాయి. ఒడిశా ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టుగా ప్రమాణాలను మార్చాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో బీహార్‌తో పాటు ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడం లేదని నితీశ్ కేంద్రంపై విరుచుకుపడ్డారు.