ఏమిటీ... బెంగళూరులో వర్షం కురిసి అన్ని రోజులయ్యిందా..!

By Arun Kumar P  |  First Published Apr 16, 2024, 12:15 PM IST

కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ వర్షం కురిసి ఎన్నిరోజుల అయ్యిందో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. 


బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలే కాదు విలాసవంతమైన భవనాలు, విల్లాల్లో వుండే ధనవంతులకు సైతం నీటి కష్టాలు తప్పడంలేదు. ఇలా బెంగళూరులో నీటి కష్టాలకు ఎండలు పెరగడమే కాదు వర్షాలు కురవకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. బెంగళూరులో గత146 రోజులుగా అంటే దాదాపు ఐదు నెలలుగా వర్షమే పడలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. 

గత వారం రోజులుగా బెంగళూరులో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే రానున్న రోజుల్లో బెంగళూరు నగరంలో అస్థిరంగా వర్షాలు కురిసే అవకాశాలున్న వున్నాయట. అంటే బెంగళూరులో కురిసే వర్షాలను అంచనాలకు తగ్గట్లుగా వుండవన్నమాట. దీంతో బెంగళూరు వాతావరణ పరిస్థితుల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Latest Videos

ఈ ఏడాది ఆరంభంలో జనవరి 11న బెంగళూరు విమానాశ్రయ ప్రాంతంలో చిరుజల్లులు కురిసినట్లు... దీనికి రెండ్రోజుల ముందు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినట్లు చెబుతున్నారు. అయితే ఈ చిరుజల్లులు బెంగళూరు నగరమంతా... మరీ ముఖ్యంగా భారత వాతావరణ శాఖ  అబ్జర్వేటరీ సమీపంలో కురవలేదు. కాబట్టి బెంగళూరులో చివరగా నవంబర్ 21, 2023 లో కురిసినట్లు ఐఎండి గుర్తించింది. 

బెంగళూరు విమానాశ్రయ వాతావరణ విభాగం డైరెక్టర్, శాస్త్రవేత్త సీఎస్ పాటిల్ నగరంలో వర్షాలు కురవకపోవడానికి గల కారణాలను తెలియజేసారు. 

1. ఫసిపిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. 

2. ప్రస్తుతం వాతావరణం స్థిరంగా వుంది. ఇది అస్థికంగా ఉన్నపుడే మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. రాబోయే మూడురోజులు కూడా వాతావరణం స్థిరంగా వుంటుంది... కాబట్టి వర్షాలు కురిసే అవకాశం లేదు. 

3. 2023 లో కరువు పరిస్థితుల కారణంగా భూమిలో తేమ లేదు. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి వర్షాలు కురవడం లేదు.   

 దేశవ్యాప్తంగా మండిపోనున్న ఎండలు : 

భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి... ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికంటే చాలా అధికంగా వున్నాయని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోనూ ఇదే పరిస్థితి వుందని చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో వేడిగాలులు వీయడం లేదు... కాబట్టి బెంగళూరు దక్షిణ ప్రాంతంల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.  బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు కురవొచ్చని భావించారు. కానీ వాతావరణ పరిస్థితులు అస్థిరంగా వుంటేనే మేఘాలు ఏర్పడి వర్షపాతం నమోదవుతుంది... కానీ బెంగళూరులో వాతావరణం స్థిరంగా వుంది. కాబట్టి వర్షాలు కురవకుండా ఎండలు మండిపోతున్నాయి. 

బెంగళూరులోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి...

గత 42 ఏళ్లలో బెంగళూరులో సగటు ఉష్ణోగ్రత దాదాపు ఒక డిగ్రీ పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ పెరుగుదల గత రెండు దశాబ్దాలలో మరీ ఎక్కువయింది. దీంతో నీటి ఆవిరి పెరిగింది. ఇక గత మూడు సంవత్సరాలుగా తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయి... రిజర్వాయర్లో నీటి నిల్వ కూడా లేకుండా పోయింది. ఇదే ఇప్పుడు బెంగళూరులో నీటి కొరతకు కారణమయ్యింది. 

నీటి కొరత తగ్గాలంటే సమృద్దిగా వర్షాలు కురవడమే మార్గం... వర్షాలు లేవంటే ఈ నీటికొరత కొనసాగుతుంది. కాబట్టి బెంగళూరువంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నగరాలే కాదు దీన్ని గుణపాఠంగా భావించి మిగతా నగరాలు కూడా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. చెట్లను కాపాడుతూ అటవీ శాతాన్ని పెంచడంద్వారా వర్షభావ పరిస్థితుల నుండి బయటపడవచ్చు. కాబట్టి చెట్లను పెంచాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. 

click me!