టీకా తీసుకున్న తర్వాత ప్యారాసెటమల్ వేసుకోవద్దా? భారత్ బయోటెక్ ఏమన్నదంటే..!

By Mahesh KFirst Published Jan 6, 2022, 12:59 PM IST
Highlights

టీకా వేసిన తర్వాత పారాసెటమల్ లేదా పెయిన్ కిల్లర్లను సజెస్ట్ చేయడంపై కొవాగ్జిన్ టీకా తయారిదారు భారత్ బయోటెక్ బుధవారం స్పందించింది. 15 నుంచి 17 ఏళ్ల చిన్నారులకు కొవాగ్జిన్ టీకా వేసిన తర్వాత పారాసెటమల్, ఇతర పెయిన్ కిల్లర్లను సూచించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 10 నుంచి 20 శాతం మంది వాలంటీర్లలో సైడ్ ఎఫెక్ట్‌లు కనిపించాయని, ఆ తర్వాత అవి ఒకట్రెండు రోజుల్లో నయం అయ్యాయని వివరించింది.

హైదరాబాద్: కరోనా మహమ్మారి(Coronavirus) విజృంభించిన కాలంలో ఆగమేఘాల మీద కరోనా టీకాలు తయారు చేశారు. అత్యంత సమర్థులైన నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఎట్టకేలకు పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటి సామర్థ్యాల్లో కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి. కొన్నింటితో సైడ్ ఎఫెక్ట్‌లు కాస్త ఎక్కువ.. మరికొన్నింటిలో తక్కువ. మన దేశంలో అత్యధికంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వేశారు. ఈ టీకాలు వేసుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం రూపంలో సైడ్ ఎఫెక్ట్‌లు కనిపించాయి. అందుకే టీకా వేసుకోగానే పారాసెటమల్ వంటి టాబ్లెట్లు వేసుకోవడం సాధారణంగా మారింది. అయితే, ఇటీవలే చిన్న పిల్లలకూ అంటే.. 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకూ టీకా పంపిణీ(Vaccination) ప్రారంభమైంది. దీంతో మరోసారి.. సైడ్ ఎఫెక్ట్‌(Side Effects)గా జ్వరం వస్తే పారాసెటమల్ టాబ్లెట్ వేసే అంశం చర్చకు వచ్చింది. కొన్ని టీకా కేంద్రాలు పిల్లలకు టీకా వేసి పారాసెటమల్ టాబ్లెట్(Paracetamol) వేసుకోవాల్సిందిగా ఉచిత సలహాలూ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్ టీకా తయారుదారు భారత్ బయోటెక్ స్పందించింది.

పిల్లలకు టీకా వేసిన తర్వాత పారాసెటమల్ లేదా.. పెయిన్ కిల్లర్లు వేయాల్సిన అవసరం లేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేసిన తర్వాత మూడు పారాసెటమల్ 500 ఎంజీ టాబ్లెట్లు వేసుకోవాలని కొన్ని టీకా కేంద్రాలు సూచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని బుధవారం భారత్ బయోటెక్ స్పందించింది. కొవాగ్జిన్ టీకా వేసిన తర్వాత పారాసెటమల్, పెయిన్ కిల్లర్లను సూచించాల్సిన పని లేదని ట్విట్టర్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ తన క్లినికల్ ట్రయల్స్‌నూ ప్రస్తావించింది.

Also Read: భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే 90 వేలకు పైగా కొత్త కేసులు.. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్

30 వేల మందిపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ నిర్వహించామని భారత్ బయోటెక్ వివరించింది. అందులో పది నుంచి 20 శాతం మందిలొ సైడ్ ఎఫెక్ట్‌లు కనిపించాయని తెలిపింది. అందులోనూ చాలా సైడ్ ఎఫెక్ట్‌లు చాలా స్వల్పమైనని పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లో ఆ సైడ్ ఎఫెక్ట్‌లు నయం అవుతాయని తెలిపింది. వాటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి మెడికేషన్ అవసరం లేదని వివరించింది. అవసరమైనప్పుడు.. అది కూడా ఫిజిషియన్‌ను కన్సల్ట్ అయిన తర్వాత మాత్రం మెడికేషన్ తీసుకోవాలని తెలిపింది. ఇతర టీకాలతోపాటు పారాసెటమల్‌ను రికమండ్ చేస్తున్నారని, కానీ, కొవాగ్జిన్ టీకా వేసుకున్న వారికి పారాసెటమల్ టాబ్లెట్లను సూచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Also Read: ల‌క్ష‌ణాలు లేకుంటే హోం ఐసోలేషన్ 7 రోజులు సరిపోతుంది.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్..

 తాజాగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 90 వేలు దాటింది.   గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా  90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా Covidతో 325 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది. నిన్న దేశంలో కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,41,009కి చేరంది. ప్రస్తుతం దేశంలో 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

click me!