మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు.. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఏమందంటే

By Sumanth KanukulaFirst Published Jan 6, 2022, 12:58 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర పర్యటన కోసం పంజాబ్ పోలీసుల బందోబస్త్‌కు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని బఠిండా జిల్లా జడ్జిని ఆదేశించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana), జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడా ధర్మసనాన్ని పిల్ దాఖలు చేసిన సంస్థ తరఫున లాయర్ Maninder Singh అభ్యర్థించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ((Narendra Modi) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టులో (Supreme Court) గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భద్రతా లోపాల కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ అరగంటల పాటు ఫ్లై ఓవర్‌పై చిక్కుకుపోయిందని.. ఇందుకు సంబంధించి విచారణ ప్రారంభించాలని కోరుతూ లాయర్ వాయిస్ (Lawyers Voice) అనే సంస్థ పిల్ దాఖలు చేసింది. ప్రధానమంత్రి పర్యటన కోసం పంజాబ్ పోలీసుల బందోబస్త్‌కు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని బఠిండా జిల్లా జడ్జిని ఆదేశించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడా ధర్మసనాన్ని పిల్ దాఖలు చేసిన సంస్థ తరఫున సీనియర్ లాయర్ Maninder Singh అభ్యర్థించారు. 

ప్రధాన మంత్రి కాన్వాయ్ రోడ్డుపై చిక్కుపోయిన ఘటన.. పంజాబ్ ప్రభుత్వం తరఫున తీవ్రమైన లోపమని, ఈ భద్రతా ఉల్లంఘన ఆమోదయోగ్యం కానివని మణిందర్ సింగ్ అన్నారు. పంజాబ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సమగ్రమైన దర్యాప్తు జరపాలని కోరారు. ఈ క్రమంలోనే.. ‘మీరు కోర్టు నుంచి ఏమి ఆశిస్తున్నారు?.. ఆరోపించిన భద్రతా లోపం బఠిండాలో జరిగిందా లేదా ఫిరోజ్‌పూర్‌లో జరిగిందా’ అని CJI NV Ramana నేతృత్వంలోని ధర్మాసం మణిందర్ సింగ్‌ను ప్రశ్నించింది. ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్‌లో ప్రసంగించాల్సి ఉందని.. అయితే బఠిండాలో భద్రతా లోపం జరిగిందని మణిందర్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. 

Also Read: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది?.. వారి తప్పిదమేనా?.. మాజీ డీజీపీ ఏం చెప్పారంటే..

భవిష్యత్తులో ప్రధాని పర్యటనలో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా.. జవాబుదారీతనం ఉండేలా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయపరమైన విచారణ చేపట్టాలని మణిందర్ సింగ్ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే పిటిషన్ కాపీని పంజాబ్ ప్రభుత్వానికి అందజేయాలని.. మణిందర్ సింగ్‌ను సుప్రీం ధర్మాసనం కోరింది. దీనిపై విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. 

ఇక, భద్రతా లోపం ఉద్దేశపూర్వకమైనది స్పష్టంగా తెలుస్తోందని.. జాతీయ భద్రత, పంజాబ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పాత్రపై తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతుందని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ‘పంజాబ్‌లో ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రధానమంత్రికి అత్యున్నత ప్రమాణాల కూడిన భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి. ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా డీజీపీ లేదా వారి ప్రతినిధి వాహనం.. ప్రధానమంత్రి వాహనశ్రేణిలో చేరడం తప్పనిసరి. అయితే సీఎస్‌ వాహనం గానీ, డీజీపీ వాహనం గానీ, వారి ప్రతినిధి వాహనం గానీ.. ప్రధాని వాహనశ్రేణిలో చేరలేదు’ అని పిల్‌లో పేర్కొన్నారు. 

ప్రైవేట్ వ్యక్తులకు ప్రధానమంత్రి మార్గంలోకి ప్రవేశం కల్పించబడిందని పిల్‌లో ఆరోపించారు. ప్రధానమంత్రికి సంబంధించిన భద్రతా లోపాం పంజాబ్ పోలీసుల సహకారంతో జరిగిందని కూడా ఆరోపించారు. ‘ప్రధానమంత్రి వెళ్లే మార్గం పంజాబ్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు.. భద్రతా కారణాల దృష్ట్యా దీనిని ఎవరికి తెలియజేయకూడదు. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి భద్రతలో జరిగిన అతి పెద్ద లోపం ఇదే’ అని పిల్‌లో పేర్కొన్నారు. 

అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని నియమించిన పంజాబ్ ప్రభుత్వం..
ప్రధాని మోదీ పర్యటనలో భద్రత వైఫల్యాలపై కేంద్ర హోం శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. రిటైర్డ్ జస్టిస్ మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్ అండ్ జస్టిస్) అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 

click me!