కాంగ్రెస్ లేకుండా ఏ ప్రతిపక్ష కూటమి సాధ్యం కాదు.. : జైరాం ర‌మేష్

By Mahesh RajamoniFirst Published Mar 19, 2023, 11:28 PM IST
Highlights

New Delhi: మమతా బెనర్జీ నాయ‌క‌త్వంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) రెండూ కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ దూరంగా ఉంటాయని, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపే.. ప్రత్యేక కూటమి సూచ‌న‌లు పంపాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు జైరాం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
 

Congress leader Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కొనే ప్రతిపక్ష ఫ్రంట్ ఏదీ సాధ్యం కాదనీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంకీర్ణం ఏర్పడితే అందులో ఆ పార్టీదే కీలక పాత్ర అని కాంగ్రెస్ సీనియర్ నాయ‌కుడు జైరాం రమేష్ అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఇప్ప‌టికే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం అన్ని పార్టీలు ముందస్తు ప్రణాళిక‌ల‌తో ముందుకు సాగుతూ.. ప్ర‌త్యేక ఫ్రంట్ అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మూడో ప్ర‌తిప‌క్ష కూటమి అంశం గురించి రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జై రాం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత కర్ణాటకలో రాబోయే ఎన్నికలు, ఈ సంవత్సరం వరుస రాష్ట్రాల ఎన్నికలపై ఉన్నందున సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌త్యేక కూట‌మి గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అన్నారు.

మమతా బెనర్జీ నాయ‌క‌త్వంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) రెండూ కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ దూరంగా ఉంటాయని, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపే సూచ‌న‌లు పంపాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు జైరాం ర‌మేష్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీ, ఎస్పీ చర్యలు ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తాయా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. టీఎంసీ, సమాజ్ వాదీ, ప్రజలు కలుస్తూనే ఉన్నారని, థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ఏర్పడుతూనే ఉంటాయని, అయితే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండటం అవసరమన్నారు. ప్రతిపక్ష కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదన్నారు. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంద‌ని అన్నారు. 

"ముందుగా కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ఎన్నికలతో పూర్తిగా బిజీగా ఉంటామనీ, 2024 ఎన్నికల గురించి తర్వాత చూస్తాం.. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతాయి, పొజిషనింగ్ కొనసాగుతుంది. తాను థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, నాలుగో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, ఐదో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ ఇలా అన్ని కొన‌సాగుతాయ‌ని" చెప్పారు. ఏ ప్రతిపక్ష కూటమికైనా బలమైన కాంగ్రెస్ అవసరమనీ, అయితే ప్రస్తుతానికి పార్టీ ప్రాధాన్యత కర్ణాటక ఎన్నికలు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల ఎన్నికలేనని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీలతో చర్చలు జరుపుతారని చెప్పారు. అదానీ అంశంపై ప్రతిపక్షాల నిరసనలకు టీఎంసీ దూరంగా ఉండటం, ఎన్సీపీ మద్దతు తెలపకపోవడం ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసిందా అని ప్రశ్నించగా. టీఎంసీకి సొంత లాజిక్ ఉండొచ్చు, అంతకుమించి నేనేమీ చెప్పదలచుకోలేద‌ని పేర్కొన్నారు.

click me!