
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పుడు జమ్ము కశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో అన్ని రంగాల్లో అభివృద్దికి కొత్త ఉదయం ప్రారంభమైంది. కశ్మీర్ లోయలోకి ఏకంగా విదేశీ పెట్టుబడులే పరవళ్లు తొక్కుతున్నాయి. ఇది స్థానికుల జీవిత ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్నాయి. తాజాగా, ఈ రోజు మార్చి 19వ తేదీన దుబాయికి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎమార్ గ్రూప్ శ్రీనగర్‌లో 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో భారీ షాపింగ్ మాల్ నిర్మించడానికి శంకుస్థాపన చేసుకుంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శంకుస్థాపన చేశారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత వచ్చిన తొలి విదేశీ పెట్టుబడి ఇదే కావడం విశేషం.
ఈ భారీ షాపింగ్ మాల్‌లో ఎన్నో బ్రాండ్లు కొలువుదీరుతాయి. ఇందులో అబు దాబికి చెందిన లులు గ్రూప్ హైపర్ మార్కెట్‌ను నిర్వహించనుంది. పశ్చిమ ఆసియాలో లులు గ్రూప్ ఎక్కువగా సూపర్ మార్కెట్లు నడుపుతుంది. లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ మాట్లాడుతూ, ఎమార్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్న షాపింగ్ మాల్‌లో లులు గ్రూప్ హైపర్ మార్కెట్ నడపడానికి డీల్ చేసుకుందని వెల్లడించారు.
ప్రస్తుతం లులు గ్రూప్ జమ్ము కశ్మీర్ నుంచి యాపిల్స్ ఎగుమతి, కుంకుమ పూవులు, డ్రై ఫ్రూట్స్‌ను ఎగుమతి చేసే పనిలో ఉన్నది. శ్రీనగర్‌లో భారీ షాపింగ్ మాల్ నిర్మించడమే కాదు.. ఈ లోయలో తన వ్యాపార కార్యకలాపాలను ఎమార్ గ్రూప్ మరింత విస్తరించాలని యోచిస్తున్నది. ఈ గ్రూప్ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనుంది.
ఏడాది క్రితం జమ్ములో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో రూ. 19 వేల కోట్ల విలువైన 39 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఇందులో 20 ఒప్పందాలు రెసిడెన్షియల్ సెక్టార్‌కు సంబంధించినవి. కమర్షియల్‌లో ఏడు, హాస్పిటాలిటీలో నాలుగు, ఇన్‌ఫ్రాటెకె సహా ఇతర రంగాల్లో మరో మూడు ఒప్పందాలు జరిగాయి.
కశ్మీర్ లోయలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపట్టి మిగితా ప్రాంతాలకు దీటుగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. స్థానికులు కూడా ఇప్పుడు ఇక నుంచి మార్పు ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: బాధ పెట్టాలని కాదు బాధలో ఉండి అలా చేశాను... అల్లు అర్జున్ హీరోయిన్ సంజాయిషీ
లోయలో శాంతి, సౌభాగ్యం విలసిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఓ స్థానికుడు చెప్పాడు. జమ్ము కశ్మీర్‌లో ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని, ఇవి ఇక్కడి యువత ఉపాధికి దారులు వేస్తాయని అన్నాడు.
ఆర్టికల్ 370 రద్దుకు పూర్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో కేవలం రూ. 14వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు విదేశీ మదుపరులూ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
పార్లమెంటులో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, జమ్ము కశ్మీర్ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు రూ. 1,547 కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని వివరించారు. అంతేకాదు, రూ. 64,058 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.
2021-22 కాలంలో రూ. 376.76 కోట్ల పెట్టుబడులు, 2020-21లో రూ. 412.74 కోట్ల పెట్టుబడులు, 2019-20లో రూ. 296.64 కోట్లు, 2018-19 కాలంలో రూ. 590.97 కోట్లు, 2017-18లో రూ. 840.55 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వివరించారు.
గత నెలలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 120,000 మెట్రిక్ టన్నుల కలర్ కోటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్టరింగ్ యూనిట్ స్థాపించాలే ప్రణాళికలను ప్రకటించింది.