ఎంతమందినైనా అరెస్టు చేయండి.. 2024లో కేజ్రీవాలే ప్రధాని: బీజేపీపై ఢిల్లీ మంత్రి విమర్శలు

By Mahesh KFirst Published Aug 27, 2022, 2:52 PM IST
Highlights

ఢిల్లీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎంత మందినైనా అరెస్టు చేయండి.. కానీ, 2024లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదుని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో ఎంత గొడవ పెట్టుకుంటే బీజేపీ అంత లోతుగా తన గోతిని తవ్వుకున్నట్టే అని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ పై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల విచారణ ఢిల్లీ రాజకీయాలను కుదిపేస్తున్నది. డిప్యూటీ మినిస్టర్ మనీష్ సిసోడియా నివాసంలో రైడ్స్ జరిగిన తర్వాతి రోజుల్లోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించి క్యాంపెయిన్ చేయడం ఆప్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని గణనీయంగా పెంచేసింది. తాజాగా, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లో అరవింద్ కేజ్రీవాల్ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని, ఆయనను ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. బీజేపీ ఆయనను నిలువరించలేదని పేర్కొన్నారు.

ఢిల్లీ శాసన సభలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గోపాల్ రాయ్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు సంధించారు. బీజేపీ తమ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ అరెస్టు చేయనివ్వండి.. కానీ, 2024లో తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రధానిగా ఎదగడాన్ని అడ్డుకోలేదని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌తో ఎంతగా ఘర్షణలకు దిగడానికి ప్రయత్నిస్తుందో.. బీజేపీ అంత లోతుగా దాని సమాధిని తవ్వుకున్నట్టేనని పేర్కొన్నారు. తాము ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నా... లేకున్నా తమ ప్రభుత్వం కూలిపోయినా తాము దేశం కోసమే బ్రతుకుతామని, ప్రాణాలిస్తామని చెప్పారు.

మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ తనిఖీల ద్వారా ఆప్ తమ ముందు మోకరిల్లుతుందని బీజేపీ తప్పుడు అంచనా వేసిందని అన్నారు. వారి అంచనాలను ఆ తర్వాతి రోజే మనీష్ సిసోడియా కూల్చేశారని, ఆయన వారి స్వరాష్ట్రం గుజరాత్‌లో సింహంలా గర్జించారని వివరించారు. 

దేశం కోసం తాము ఏదైనా సాధించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ప్రజలు తమలో చూస్తున్నారని గోపాల్ రాయ్ అన్నారు. తమ ప్రాణాలు పోయినా ఆ విషయంలో రాజీ పడబోమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వివరించారు. తమ ప్రభుత్వం ఉన్నా.. పోయినా తాము బాధపడమని, ఈ పదవులూ ఉన్నా ఊడినా లెక్క చేయమని తెలిపారు. 

సీబీఐ, ఈడీలను పంపించి తమ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలనుకుంటే చేయండి అని సవాల్ చేశారు. వారి సలహాదారుల సూచనలకు అనుగుణంగా కేజ్రీవాల్‌నూ అరెస్టు చేయాలనుకుంటే ఆ పనీ చేయండని పేర్కొన్నారు. కానీ, తన వ్యాఖ్యలను గుర్తు పెట్టుకోవాలని, 2024లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిగా ఎదగకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

click me!