జార్ఖండ్ పొలిటికల్ హైడ్రామా షురూ.. బ్యాగులు సర్దుకున్న అధికారపక్ష ఎమ్మెల్యేలు

By Mahesh KFirst Published Aug 27, 2022, 2:01 PM IST
Highlights

జార్ఖండ్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది. సీఎం హేమంత్ సోరెన్ అనర్హత  చుట్టూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల బలాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి తమ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గడ్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. 

రాంచీ: జార్ఖండ్‌లో పొలిటికల్ హైడ్రామా షురూ అవుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనర్హత వాదనలు విజృంభించిన తరుణంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే సందేహాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేళ సీఎంపై అనర్హత వేటు వేస్తే.. ప్రతిపక్ష బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అధికార యూపీఏ పక్షం కుప్పకూలుతుందా? రాష్ట్రంలో అధికారం మారుతుందా? లేక సింపుల్‌గా సీఎం మార్పు జరుగుతుందా? అసలు అనర్హత వేటు ప్రకటన రాదా? ఇలా అనేక కోణాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి, రాజకీయ పార్టీలు ముందుజాగ్రత్తల్లో భాగంగా తమ బలాన్ని అంటిపెట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి పరిణామం వచ్చినా.. ఒక వేళ బల నిరూపణ చేసే అవసరం వచ్చినా తమ ఎమ్మెల్యేలను నియంత్రణలో ఉంచుకోవడం ఉత్తమమైన మార్గం అని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా అధికారపక్షం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు అర్థం అవుతున్నది.

ప్రజాస్వామికంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నారని ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర విమర్శలు చేశారు. వారి కుట్రలకు బెదిరిపోయే అవసరం తమకు లేదని స్పఫ్టం చేశారు. తమకు ప్రజలు ఇచ్చిన బలం ఉన్నదని వివరించారు. 

ఇలాంటి తరుణంలో అధికార యూపీఏ కూటమి ఎమ్మెల్యేలు సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి వచ్చారు. ఊరికే కాదు.. ఏకంగా లగేజీ సర్డుకుని సోరెన్ నివాసంలో దిగిపోయారు. యూపీఏ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్‌కు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ ఎమ్మెల్యేలను ప్రలోబాల నుంచి, ఫిరాయింపుల కోసం జరిగే ప్రయత్నాలకు దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ తరలింపు ఉండనున్నట్టు వివరించాయి. 

జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. అందులో అధికార కూటమి యూపీఏ బలం 49 ఎమ్మెల్యేలు. జేఎంఎం సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఈ పార్టీ శాసన సభ్యుల సంఖ్య 30. కాంగ్రెస్‌కు 18 మంది ఎమ్మెల్యేలు, ఒక్క ఆర్జేడీ ఎమ్మెల్యే ఉన్నారు. కాగా, బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది.

ఒక వేళ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిని చేస్తే.. సీఎం రేసులో జేఎంఎం నుంచే పలువురు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ పరిణామం జేఎంఎంలోనూ పొరపొచ్చాలకు కారణంగా మారే అవకాశాలూ ఉన్నాయి. నేతల మధ్య అభిప్రాయబేధాలు, పదవి లాలసతో జేఎంఎం చీలిపోయే ముప్పూ ఉన్నది. ఈ కారణంగా తమ బలాన్ని పటిష్టంగా ఉంచడానికి అధికారపక్షం ఛత్తీస్‌గడ్‌కు తమ ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు.

click me!