ప్రధాని మోడీపై, భారతీయులపై మల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ దేశం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేసింది.
భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అవమానకరమైన పోస్ట్‌లకు కారణమైన మంత్రులను సస్పెండ్ చేస్తూ మాల్దీవుల ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారి తీశాయి. దీని వల్ల ఆ దేశంపై భారతీయులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ మల్దీవుల ప్రభుత్వం వేగంగా స్పందించింది.
సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌లకు సంబంధించి భారత ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకరమైన పోస్టులు చేసిన వారిని మంత్రి పదవుల నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. అయితే ఆ ప్రకటనలో సస్పెండ్ అయిన మంత్రుల పేర్లను మాత్రం వెల్లడించలేదు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. సస్పెండ్ అయిన మంత్రుల్లో మరియం షియునా, మల్షా, హసన్ జిహాన్ ఉన్నారు. ఇటీవల మాల్దీవుల మంత్రి ఒకరు ప్రధాని మోదీపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై ఆదివారం భారత్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. మాలేలోని భారత హైకమిషనర్ ఈ విషయంపై మాల్దీవుల ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi)ఇటీవల లక్షద్వీప్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీపై పలువురు మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని పర్యవసానాలను గ్రహించిన మాల్దీవుల ప్రభుత్వం అంతకు ముందు ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశీ నాయకులు, ఉన్నత స్థాయి వ్యక్తులపై సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు గురించి తమకు తెలుసునని తెలిపింది. ఇది ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించదని పేర్కొంది. అంతే కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే ?
ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 4 న లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి బీచ్ లోని ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన షేర్ చేశారు. మాల్దీవుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా లక్షద్వీప్ అందాలను కొనియాడుతూ.. ‘ఇటీవల లక్షద్వీప్ ప్రజల మధ్య ఉండే అవకాశం నాకు లభించింది. దాని ద్వీపాల అద్భుతమైన అందానికి, అక్కడి ప్రజల నమ్మశక్యం కాని వెచ్చదనానికి నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. అగత్తి, బంగారులో ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించింది.’’ అని పేర్కొన్నారు.
అయితే పలువురు మాల్దీవుల మంత్రులు దీన్ని నేరంగా పరిగణించారు. భారతీయులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. మాల్దీవుల బీచ్ ల పరిశుభ్రత స్థాయిని భారతీయ బీచ్ లు అందుకోలేకపోయాయని పలువురు మంత్రులు పేర్కొన్నారు. ‘‘ఈ చర్య చాలా బాగుంది. అయితే మాతో పోటీ పడాలనే ఆలోచన కూడా ఓ భ్రమనే. మేము అందించే సర్వీస్ ను వారు ఎప్పుడు అందించలేరు.? అక్కడ శుభ్రత ఉండదు.? గదుల్లో దుర్వాసన వస్తుంటుంది’’ అని అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల (పీపీఎం) కౌన్సిల్ సభ్యుడు జాహిద్ రమీజ్ ‘ఎక్స్’ లో రాశారు.
కాగా.. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. భారతీయులు మల్దీవుల్లో ప్లాన్ చేసుకున్న పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అందరూ అలాగే చేయాలని విజ్ఞప్తి చేశారు. మల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను సినీ సెలబ్రేటీలు కూడా ఖండించారు. మల్దీవులకు బదులు లక్షద్వీపాన్ని సందర్శించాలని అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ తారలు, అలాగే సచిన్ టెండూల్కర్ కూడా తమ అభిమానులను కోరారు.
సెప్టెంబర్ లో మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అందులో చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు అనూహ్య విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. చైనాను ఆకర్షించే ప్రయత్నంలో ఆ దేశం నుంచి భారత సైనిక ఉనికిని ఉపసంహరించుకోవాలని ఆ దేశ ప్రధాని ఆదేశించారు. ఇప్పుడు ప్రధానిపై ఆ మల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉంది.