‘నో డేటా అవైలబుల్’ - పార్లమెంట్ లో కేంద్రం సమాధానాలపై మండిప‌డ్డ‌ రాహుల్ గాంధీ..

Published : Jul 23, 2022, 04:38 PM IST
‘నో డేటా అవైలబుల్’ - పార్లమెంట్ లో కేంద్రం సమాధానాలపై మండిప‌డ్డ‌ రాహుల్ గాంధీ..

సారాంశం

ఎన్డీఏ అంటేనే నో డేటా అవైలబుల్ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రం దగ్గర ఏ సమాచారమూ ఉండదని మండిపడ్డారు. కోవిడ్ వల్ల, ఆక్సిజన్ కొరతతో, కాలినడకన నడుస్తూ ఏ కూలీ చనిపోలేదని, ఏ జర్నలిస్టుపై కేసు నమోదు కాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు. 

పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ప్ర‌భుత్వం ఇచ్చిన స‌మాధానాల‌పై కాంగ్రెస్ అధినాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎన్డీఏ అంటేనే 'నో డేటా అవైలబుల్’ అని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ఓ పోస్ట్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 

Smriti Irani Row: చ‌నిపోయిన వ్య‌క్తిపై బార్ లైసెన్స్.. స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్

‘‘ నో డేటా అవైలబుల్ (ఎన్ డీఏ) ప్రభుత్వం మిమ్మల్ని నమ్మాలని కోరుకుంటోంది : ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదు. నిరసన వ్యక్తం చేస్తూ ఏ రైతు కూడా చనిపోలేదు. ఏ వలసదారుడు కూడా నడుస్తూ మరణించలేదు. ఎవరిపై మూకదాడులు చేయలేదు. ఏ జర్నలిస్టును అరెస్టు చేయలేదు ’ అని వ్యంగంగా పేర్కొన్నారు. ‘ నో డాటా, నో ఆన్సర్స్, నో అకౌంటబులిటీ (సమాచారం, సమాధానం, జవాబుదారీతనం లేదు) ’’ అని పేర్కొంటూ ‘‘ సబ్ గయాబ్ సి ’’ అనే యానిమేటెడ్ GIFని ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. 

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం 
సమాధానం ఇచ్చిన తీరుపై రాహుల్ గాంధీ ఈ విధంగా పోస్ట్ చేశారు. కాగా.. అంగన్‌వాడీ సేవలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో అమ‌ల‌య్యే ప‌థ‌కం కాబ‌ట్టి కోవిడ్ -19 కారణంగా మరణించిన అంగన్‌వాడీ కార్యకర్తల సంఖ్యపై వివ‌రాలు అందుబాటులో లేద‌ని కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్‌సభకు తెలిపింది. 2014 నుంచి దేశంలో అరెస్టయిన జర్నలిస్టుల సంఖ్య ఎంత అనే ప్రశ్నకు కూడా ఇదే ప్ర‌భుత్వం ఇదే స‌మాధానం ఇచ్చింది. 

ఇదిలా ఉండగా.. దేశంలోని సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లలో రాయితీ ప్రయోజనాలను ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంపైనా  రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు. కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనల కోసం లక్షల కోట్లు వెచ్చిస్తోంద‌ని అన్నారు. అలాగే ప్రధాని కొత్త విమానాల కొనుగోలు కోసం, పారిశ్రామిక వేత్తలకు పన్ను మినహాయింపుల కోసం ఎన్నో కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని కానీ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రైలు టిక్కెట్లలో రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద రూ.1500 కోట్లు ఇవ్వ‌డం లేద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ స్నేహితుల కోసం నక్షత్రాలను కూడా తీసుకువస్తాను, కానీ పౌరులను, సీనియర్ సిటిజన్లను పెన్నీల కోసం ఆరాటపడేలా చేస్తున్నారు ’’ అని ఆయన అన్నారు. 

సీఎం నివాసంలో చెత్త.. రూ.పదివేల జరిమానా

కాగా.. గతంలో  సీనియర్ సిటిజన్లకు రైల్వేల్లో 50 శాతం వరకు రాయితీ ఉండేది. దీనిని మార్చి 2020లో కేంద్రం నిలిపివేసింది. కోవిడ్ -19 వ్యాధి బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటూ సీనియర్ సిటిజన్లను అనవసరమైన ప్రయాణాన్ని రద్దు చేసుకునేలా చేసేందుకు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. లోక్ సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. రాయితీలు మంజూరు చేయడం వల్ల రైల్వేలు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల సీనియర్ సిటిజన్లతో పాటు అన్ని వర్గాల ప్రయాణీకులకు రాయితీల పరిధిని విస్తరించడం మంచిది కాదనిని తెలిపారు. 2019-20లో దాదాపు 22 లక్షల మంది సీనియర్ సిటిజన్లు రైల్వేలో రాయితీ ప్రయాణాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం