మోడీ సర్కార్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. చెప్పినట్లుగానే వ్యతిరేకించిన వైసీపీ, మిథున్ రెడ్డి ఏమన్నారంటే

Siva Kodati |  
Published : Aug 09, 2023, 02:55 PM IST
మోడీ సర్కార్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. చెప్పినట్లుగానే వ్యతిరేకించిన వైసీపీ, మిథున్ రెడ్డి ఏమన్నారంటే

సారాంశం

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్లుగానే వ్యతిరేకించింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ వారిపై మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో వైసీపీ లోక్‌సభాపక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్లుగానే వ్యతిరేకించింది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో వైసీపీ లోక్‌సభాపక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రసంగించారు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచార ఘటనలు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. 

కాగా.. మణిపూర్ అంశంపై చర్చించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలవడంతో పాటు, ఢిల్లీలో సేవల నియంత్రణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేందుకు వైసీపీ సహకరించాలని నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. 

Also Read: ఢిల్లీ బిల్లు, అవిశ్వాసం: మోడీ ప్రభుత్వానికి జైకొట్టనున్న వైఎస్ జగన్

దీంతో రాజ్యసభలో సంఖ్యా బలంలేని ‘ఏన్డీఏ’ వైసీపీ ఎంపీల మద్దతుతో వివాదాస్పద ఢిల్లీ బిల్లుకు సులభంగా ఆమోదం పొందనుంది. బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి కాకుండా ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందన్న సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే ఈ విషయంలో కేంద్రానికే అధికారాలు రావాలని కొంత కాలం కిందట ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ ను ఈ వర్షాకాల సమావేశంలో చట్టంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో ఆ ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లును తీసుకువచ్చింది. 

కాగా.. రాజ్యసభలో 9 మంది, లోక్ సభలో 22 మంది సభ్యులున్న వైసీపీ పలు కీలక బిల్లులపై తరచూ ‘ఎన్డీఏ’ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థికే అనుకూలంగా ఓటు వేసింది. తాజాగా మణిపూర్ సంక్షోభంపై లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu