బెంగాల్ ఉపఎన్నికలు: కోర్టుకు బీజేపీ అభ్యర్థి.. విజయోత్సవాలు వద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు

By telugu teamFirst Published Oct 3, 2021, 2:35 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అందుకు అనుగణమైన చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింస చెలరేగిన సంగి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఉపఎన్నికల(Bypoll) కౌంటింగ్(Counting) తర్వాత విజయోత్సవాలు(Celebration), ర్యాలీలు, వేడుకలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం(EC) ఆదేశించింది. అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగాల్‌లో మూడు స్థానాల్లో ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జాంగిపూర్, సంసేర్‌గంజ్ సహా భవానీపూర్‌లోనూ ఉపఎన్నికలు జరిగాయి. భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేశారు. ఆమెపై బీజేపీ తరఫున ప్రియాంక తబ్రేవాల్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ గెలుపొందారు.

బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించి.. ఉప ఎన్నికల విజయానతరం ఉత్సవాలు, వేడుకలు చేసుకోవద్దని, తద్వారా ఎన్నికల అనంతరం హింసను అరికట్టాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారిస్తూ కోల్‌కతా హైకోర్టు అందుకు అనుగుణమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఎలాంటి హింస జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు జారీ చేసింది.

కౌంటింగ్ జరుగుతుండగా లేదా ముగిసి తర్వాత కూడా విజయోత్సవాలు, వేడుకలు, ర్యాలీలు తీయవద్దని ఈసీ సెక్రెటరీ రాకేశ్ కుమార్ ఆదేశించారు. కరోనా కారణంగా అలాంటి చర్యలన్నింటినీ నిషేధంలోనే ఉన్నాయని, అయినప్పటికీ అలాంటివేమీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. ఈ ఆదేశాలు వెలువడ్డ కొంత సేపటికే టీఎంసీ స్పందించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అందరూ తప్పకుండా పాటించాలని, విజయోత్సవ ర్యాలీలు తీయవద్దని పార్టీ నేతలకు మమతా బెనర్జీ ఆదేశించారని రాష్ట్ర రవాణా మంత్రి ఫిర్హద్ హకీం వెల్లడించారు.

click me!